Muhammad Yunus: నోబెల్ విజేతకు బంగ్లాదేశ్ లో జైలు శిక్ష
- మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ తో పేదల జీవితాలు మార్చివేశారంటూ యూనస్ కు నోబెల్
- కార్మిక చట్టాలు ఉల్లంఘించారంటూ ఆర్నెల్ల జైలుశిక్ష వేసిన కోర్టు
- వడ్డీల రూపంలో పేదల రక్తాన్ని పీల్చుతున్నారంటూ బంగ్లా ప్రధాని ఆగ్రహం
బంగ్లాదేశ్ కు చెందిన మహ్మద్ యూనస్ (83) ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి విజేత. బంగ్లాదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మందిని పేదరికం కోరల్లోంచి కాపాడారంటూ ఆయనకు నోబెల్ పురస్కారం అందించారు.
ఆయన ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా అందించిన చిన్న రుణాలు పేదల జీవితాలను మార్చివేశాయని నోబెల్ కమిటీ భావించి, అత్యున్నత పురస్కారం అందించి గౌరవించింది. కానీ, అదే మైక్రో ఫైనాన్స్ అంశంలో నోబెల్ విజేత మహ్మద్ యూనస్ కు జైలుశిక్ష పడింది.
బంగ్లాదేశ్ కార్మిక చట్టాలను యూనస్ ఉల్లంఘించారంటూ బంగ్లాదేశ్ కోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. ఆయనతో పాటు గ్రామీణ్ టెలికాం సంస్థకు చెందిన మరో ముగ్గురికి కూడా ఈ వ్యవహారంలో జైలు శిక్ష పడింది.
అటు, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా నోబెల్ శాంతి బహుమతి విజేత మహ్మద్ యూనస్ పై ధ్వజమెత్తారు. పేద ప్రజల రక్తాన్ని వడ్డీల రూపంలో పీల్చివేస్తున్నారంటూ మండిపడ్డారు. కాగా, ఇదంతా రాజకీయ కుట్ర అని మహ్మద్ యూనస్ మద్దతుదారులు బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు.