Nikhil Chaudhary: ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ లో సత్తా చాటుతున్న 'చౌదరి'
- బిగ్ బాష్ లీగ్ లో హోబర్ట్ హరికేన్స్ జట్టుకు ఆడుతున్న నిఖిల్ చౌదరి
- గతంలో పంజాబ్ తరఫున అండర్-22 వరకు ఆడిన వైనం
- 2019లో ఐపీఎల్ సెలెక్షన్ లో ఫెయిల్
- ఆ తర్వాత విహారయాత్ర కోసం ఆస్ట్రేలియా పయనం
- కరోనా సంక్షోభం కారణంగా అక్కడే చిక్కుకుపోయిన చౌదరి
ఐపీఎల్ లో ఆడేందుకు విదేశీ క్రికెటర్లను ఆహ్వానిస్తున్న బీసీసీఐ... టీమిండియా క్రికెటర్లు విదేశీ లీగ్ ల్లో ఆడేందుకు మాత్రం అనుమతించడంలేదు. కానీ, మనవాడు ఒకడు ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్ లో సత్తా చాటుతున్నాడు. అతడి పేరు నిఖిల్ చౌదరి.
27 ఏళ్ల నిఖిల్ చౌదరి ప్రధానంగా ఆల్ రౌండర్. బిగ్ బాష్ లీగ్ లో హోబర్ట్ హరికేన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మెల్బోర్న్ స్టార్స్ తో జరిగిన మ్యాచ్ లో నిఖిల్ చౌదరి ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్ లో 16 బంతుల్లోనే 32 పరుగులు చేసిన చౌదరి... అనంతరం బౌలింగ్ లో రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
నిఖిల్ చౌదరి భారత్ కు చెందిన క్రికెటర్ అయినప్పటికీ, ఆస్ట్రేలియా గడ్డపై జరిగే బిగ్ బాష్ లీగ్ లో ఆడడం వెనుక ఆసక్తి కలిగించే కథ ఉంది. నిఖిల్ చౌదరి స్వస్థలం ఢిల్లీ. అయితే అతడి తల్లిదండ్రులు చాలాకాలం కిందటే పంజాబ్ కు తరలి వెళ్లారు. క్రికెట్ పై ఆసక్తి పెంచుకున్న నిఖిల్ చౌదరి పంజాబ్ రాష్ట్ర క్రికెట్ సంఘం తరఫున అండర్-19, అండర్-22 లెవల్లో రాణించాడు.
ఇక రంజీలకు ఎంపికవుతాడు అనుకున్న తరుణంలో కథ మలుపుతిరిగింది. 2019లో ఐపీఎల్ లో ఆడేందుకు ముంబయి ఇండియన్స్ సెలెక్షన్ ట్రయల్స్ కు రెండు సార్లు హాజరయ్యాడు కానీ, ఎంపిక కాలేదు. ఆ తర్వాత ఓసారి విహారయాత్ర కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. ఎవరికి ఎప్పుడు ఎలా అవకాశం వస్తుందో తెలియదు అనడానికి చౌదరి ఉదంతమే నిదర్శనం.
మనవాడు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టగానే, కొన్నిరోజులకే ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం తలెత్తింది. ఆస్ట్రేలియా దేశం తన సరిహద్దులను మూసేసింది. దాంతో నిఖిల్ చౌదరి ఆస్ట్రేలియా నగరం బ్రిస్బేన్ లో చిక్కుకుపోయాడు. కొన్నాళ్లు ఇబ్బంది పడిన చౌదరి... ఆ తర్వాత ఆస్ట్రేలియా సంస్కృతికి అలవాటుపడ్డాడు.
ఇక ఆస్ట్రేలియానే తన ఇల్లు అని భావించి, అక్కడే తన క్రికెట్ భవిష్యత్తును వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. బ్రిస్బేన్ లోని ఓ మెక్సికన్ రెస్టారెంట్ లో పనికి కుదిరాడు. అంతేకాదు, ఆస్ట్రేలియా పోస్టల్ డిపార్ట్ మెంట్ లో కొరియర్ బాయ్ గానూ పనిచేశాడు. అయితే క్రికెటర్ గా ఎదగాలన్న తన లక్ష్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. స్థానికంగా నార్తర్న్ సబర్బ్ క్లబ్ తరఫున క్రికెట్ ఆడేవాడు. స్వతహాగా ప్రతిభావంతుడు కావడంతో స్వల్ప కాలంలోనే గుర్తింపు పొందాడు.
ఆ సమయంలో నార్తర్న్ సబర్బ్ జట్టుకు ఆసీస్ మాజీ ఆటగాడు జేమ్స్ హోప్స్ కోచ్ గా ఉన్నాడు. తర్వాతి కాలంలో జేమ్స్ హోప్స్ బిగ్ బాష్ జట్టు హోబర్ట్ హరికేన్స్ కోచ్ గా నియమితుడయ్యాడు. ఈ పరిణామం నిఖిల్ చౌదరికి కలిసొచ్చింది.
ధాటిగా బ్యాటింగ్ చేయడంతో పాటు, ఆఫ్ స్పిన్ బౌలింగ్ తోనూ రాణిస్తాడన్న నమ్మకంతో జేమ్స్ హోప్స్... నిఖిల్ చౌదరిని బిగ్ బాష్ కాంట్రాక్టుకు సిఫారసు చేశాడు. అతడి ప్రయత్నం ఫలించి, నిఖిల్ చౌదరిని హోబర్ట్ హరికేన్స్ జట్టులోకి తీసుకుంది.
ఈ సీజన్ లో చౌదరి అటు బ్యాట్ తోనూ, ఇటు బంతితోనూ రాణిస్తూ తన కెరీర్ కు బాటలు వేసుకుంటున్నాడు. కాగా, చౌదరి వికెట్ తీసినప్పుడు ఆవేశంగా తొడకొట్టే తీరు భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ను గుర్తుకుతెస్తుంది.