Uddhav Thackeray: ఉద్ధవ్ థాకరేపై అయోధ్య రామ మందిరం ప్రధాన పూజారి ఆగ్రహం
- అయోధ్య రామమందిర కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చొద్దన్న థాకరే
- తనకు ఆహ్వానం అందలేదని విమర్శ
- శ్రీరాముడి భక్తులకు మాత్రమే ఆహ్వానాలు అందజేశామన్న ప్రధాన పూజారి
ఈ నెల 22న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరగబోతోంది. ప్రధాన మూర్తిని ప్రతిష్ఠించనున్నారు. మరోవైపు ప్రారంభోత్సవ వేడుకలకు తను ఆహ్వానం లేదని శివసేన యూబీటీ చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే విమర్శించారు. రామ మందిర కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చవద్దని అన్నారు. ఈ కార్యక్రమం ఒక పార్టీ చుట్టే తిరగకూడదని అన్నారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై అయోధ్య ఆలయం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ మహా సంప్రోక్షణకు కేవలం శ్రీరాముడి భక్తులకు మాత్రమే ఆహ్వానాలు అందజేశామని చెప్పారు. రాముడి పేరు చెప్పుకుని ప్రతిపక్షంలోని కొన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. రాముడిని నమ్మినవారు ప్రస్తుతం అధికారంలో ఉన్నారని చెప్పారు.
మన ప్రధానిని ప్రతి చోట గౌరవిస్తారని... ఆయన ఎంతో భక్తిపరుడని సత్యేంద్ర దాస్ అన్నారు. రాముడి పేరు మీద ప్రధాని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించడం తప్పని వ్యాఖ్యానించారు. దేశం కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.