Sri Chilkur Balaji Temple: చిలుకూరులో నేడు మహాద్వార దర్శనం.. 1.50 లక్షల మంది దర్శించుకునే అవకాశం
- భక్తుల రద్దీ నేపథ్యంలో 108 ప్రదక్షిణల నిలిపివేత
- ఆలయానికి కిలోమీటరు దూరంలో పార్కింగ్
- ప్రత్యేక ట్రిప్పులు నడుపుతున్న ఆర్టీసీ
- భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయం వద్ద ఏర్పాట్లు
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చిలుకూరు బాలాజీ దేవాలయంలో నేడు మహాద్వారం నుంచి స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కొత్త ఏడాది వేళ నేడు దాదాపు లక్షన్నరమంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారని అంచనా.
భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 108 ప్రదక్షిణలు నిలిపివేయడంతోపాటు మహాద్వారం (లఘుదర్శనం) నుంచే దర్శనాలు చేపట్టాలని నిర్ణయించారు. నాలుగు క్యూల ద్వారా భక్తులను అనుమతించనుండగా, ఆలయానికి కిలోమీటరు దూరంలోనే పార్కింగ్ ఏర్పాటు చేశారు. భక్తులు అక్కడి నుంచి కాలినడకన ఆలయానికి రావాల్సి ఉంటుంది.
భక్తుల రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక ట్రిప్పులు నడుపుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయం వద్ద ఏర్పాట్లు చేశారు. అలాగే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.