Nitish Kumar: బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు రూ.1.64 కోట్ల విలువైన ఆస్తులు

Nitish Kumar Owns Assets Worth 1 crore and 64 lakh rupees
  • 13 ఆవులు, 10 దూడలు, 2 బంగారు రింగులు ఉన్నాయని వెల్లడి
  • న్యూఢిల్లీలో రూ.1.48 కోట్ల విలువైన ఏకైక స్థిరాస్తి ఉందని తెలిపిన సీఎం
  • సీఎం సహా కేబినెట్ మంత్రుల ఆస్తులు, అప్పుల వివరాలు ప్రకటించిన నితీష్ సర్కారు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. మొత్తం రూ.1.64 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం తన వద్ద రూ.22,552 నగదు ఉందని, రూ.49,202 బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ల రూపంలో ఉన్నాయని తెలిపారు. రూ.11.32 లక్షల విలువైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు, రూ.1.28 లక్షల విలువైన 2 బంగారు ఉంగరాలు, ఒక వెండి ఉంగరం, రూ.1.45 లక్షల విలువైన 13 ఆవులు, 10 దూడలు, ట్రెడ్‌మిల్, ఎక్సర్‌సైజ్ వీల్, ఒక మైక్రోవేవ్ ఓవెన్ వంటి ఇతర చరాస్తులు ఉన్నాయని వివరించారు. 

న్యూఢిల్లీలోని ద్వారకలో అపార్ట్‌మెంట్‌ రూపంలో ఏకైక స్థిరాస్తి ఉందని, దీని ధర 2004లో రూ.13.78 లక్షలు ఉండగా ప్రస్తుతం దీని విలువ రూ.1.48 కోట్లుగా ఉందన్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం క్యాబినెట్ సెక్రటేరియట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో సీఎం నితీష్‌తోపాటు క్యాబినెట్ మంత్రుల వివరాలను వెల్లడించారు. కాగా గతేడాది తన ఆస్తుల విలువ రూ. 75.53 లక్షలుగా ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని అపార్ట్‌మెంట్ ధర పెరగడంతో ఆస్తుల విలువ పెరిగినట్టు స్పష్టమవుతోంది. 

ఇక డిప్యూటీ సీఎం తేజస్వి ప్రసాద్ యాదవ్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తం రూ.4.74 లక్షల ఆదాయాన్ని ప్రకటించారు. తేజస్వి అన్నయ్య తేజ్ ప్రతాప్ ఆస్తుల విలువ రూ.3.58 కోట్లుగా ఉంది. కాగా ప్రతి క్యాలెండర్ ఏడాది చివరి రోజున సీఎం సహా కేబినెట్ మంత్రులు అందరూ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించడం తప్పనిసరి చేస్తూ నితీష్ కుమార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Nitish Kumar
Assets
Bihar
Tejashwi Prasad Yadav
Tej Pratap

More Telugu News