David Warner: వన్డేలకు గుడ్‌బై చెప్పిన ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్

David Warner said goodbye to ODIs

  • 2023 ప్రపంచ కప్ గెలుపుతో నిర్ణయం తీసుకున్నానని వెల్లడి
  • అవసరమైతే మరో రెండేళ్లు జట్టుకి అందుబాటులో ఉంటానన్న వార్నర్
  • టీ20 వరల్డ్ కప్ ఆడాలని భావిస్తున్నట్టు తెలిపిన స్టార్ క్రికెటర్
  • ఇటీవలే టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన ఆసీస్ ఓపెనర్

ఇటీవలే టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వన్డేలకు కూడా గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు నూతన సంవత్సరం మొదటి రోజున కీలక ప్రకటన విడుదల చేశాడు. ఆస్ట్రేలియా జట్టుకు అవసరమైతే 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అందుబాటులో ఉంటానని 37 ఏళ్ల ఈ ఆటగాడు చెప్పాడు. వచ్చే ఏడాది జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఆడాలని భావిస్తున్నట్లు వార్నర్ తన ఆకాంక్షను వ్యక్తం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఇతర లీగ్ క్రికెట్ ఆడాలని భావిస్తున్నట్టు తెలిపాడు. కాగా పాకిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా జనవరి 3న మొదలు కానున్న టెస్టు వార్నర్ కెరియర్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ కానుంది.

‘‘ వన్డే ఫార్మాట్ నుంచి కూడా రిటైర్ అవుతున్నాను. భారత్ వేదికగా జరిగిన ప్రపంచ కప్‌ను ఆస్ట్రేలియా గెలవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. వరల్డ్ కప్ విజయం అద్భుతమని భావిస్తున్నాను. అందుకే నేను రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నాను. వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నాను. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇతర కొన్ని లీగ్‌లు ఆడేందుకు వీలు కుదురుతుంది. ఈ నిర్ణయం ఆస్ట్రేలియా వన్డే జట్టును ఇంకాస్త ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను. జట్టులో ఛాంపియన్ ఆటగాళ్లు ఉన్నారనే విషయం నాకు తెలుసు. ఛాంపియన్స్ ట్రోఫీ సాధించబోతున్నామని తెలుసు. రాబోయే రెండేళ్లలో నేను మంచి క్రికెట్ ఆడితే జట్టుకి అందుబాటులో ఉంటాను. జట్టుకి అవసరమైనప్పుడు సిద్ధంగా ఉంటాను’’ అని ప్రకటనలో వార్నర్ పేర్కొన్నాడు.

కాగా వన్డే ఫార్మాట్‌లో డేవిడ్ వార్నర్ 6,932 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆరవ ఆటగాడిగా నిలిచాడు. రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, మార్క్ వా, మైకేల్ క్లార్క్, స్టీవ్ వా మాత్రమే వార్నర్ కంటే ముందు ఉన్నారు. ఇక 2015, 2023లలో వరల్డ్ కప్ సాధించిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

David Warner
retirement
ODI cricket
Champions Trophy
Pakistan vs Australia
Cricket
  • Loading...

More Telugu News