Atchannaidu: కొలికిపూడి శ్రీనివాసరావు పట్ల జగన్ రెడ్డి వేధింపులు దుర్మార్గం: అచ్చెన్నాయుడు
- కొలికిపూడి శ్రీనివాసరావుకు సీఐడీ నోటీసులు
- ప్రజల గొంతుకలను అణచివేస్తున్నారన్న అచ్చెన్నాయుడు
- జగన్ అవినీతిని ప్రశ్నించడమే నేరమా? అంటూ వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, దళిత నేత కొలికపూడి శ్రీనివాసరావును సీఐడీ పేరుతో జగన్ రెడ్డి వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాసమస్యలపై స్పందిస్తున్న దళిత ఉద్యమ నేతపై వేధింపులకు పాల్పడటం జగన్ రెడ్డి దమనకాండకు నిదర్శనం అని విమర్శించారు. ప్రజల గొంతులను అణిచివేసే కుట్రలకు పాల్పడుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
"నోటీసులిచ్చేందుకు హైదరాబాద్ లోని కొలికపూడి శ్రీనివాసరావు నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు... ఆయన కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించారు. 11 ఏళ్ల పాపకు నోటీసులిస్తామని బెదిరించడం అమానవీయం. నియంతలు పాలిస్తున్న దేశాల్లో కూడా ఇంతటి క్రూరత్వం లేదు. కొలికపూడి నివాసానికి విజిటర్స్ గా వచ్చిన సీఐడీ అధికారులు నానా బీభత్సం సృష్టించారు.
కొలికపూడి చేసిన తప్పేంటి? ప్రజాసమస్యలు, జగన్ రెడ్డి అవినీతి, అరాచకాన్ని ప్రశ్నించడమే నేరమా? చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలన్న జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి? ప్రశ్నించేవారిని చూసి జగన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. మరో వంద రోజుల్లో జగన్ రెడ్డిని ప్రజలు తరిమివేయడం ఖాయం" అంటూ అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.