Peddireddi Ramachandra Reddy: సీఎం జగన్ తో నాకు విభేదాలా...?: మంత్రి పెద్దిరెడ్డి
- మీడియా కథనాలపై మంత్రి పెద్దిరెడ్డి అసంతృప్తి
- తప్పుడు కథనాలు రాస్తున్నారని వ్యాఖ్యలు
- ఎల్లో మీడియా అభూత కల్పనలు రాస్తోందని వెల్లడి
- ప్రజలు అంతా గమనిస్తున్నారని స్పష్టీకరణ
గనుల శాఖ, విద్యుత్ శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో తనకు సీఎం జగన్ తో విభేదాలు ఉన్నట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఆ మేరకు ఎల్లో మీడియాలో అభూత కల్పనలు రాస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ అలాంటి విభేదాలే ఉంటే తాను రాజకీయాల్లో ఉండే పరిస్థితి లేదని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.
"సీఎం జగన్ ఒక ప్రాంతీయ పార్టీకి అధినేత. ఆయనతో విభేదాలు వస్తే పార్టీ నుంచి బయటికి వచ్చేయాలి. అందుకే నన్ను పార్టీ నుంచి బయటికి వచ్చేలా చేయడానికే ఈ విధంగా రాస్తున్నారు. నేను సీఎంతో సఖ్యంగా ఉంటే వాళ్ల ప్రయోజనాలు నెరవేరవు. అందుకే ఈ తప్పుడు రాతలకు పాల్పడుతున్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్నదే వాళ్ల దురాలోచన.
పద్మా జనార్దన్ రెడ్డిని తీసేయాలంటూ నేను చెప్పినట్టు ఇవాళ వార్త రాశారు. ఇలాంటి వార్తలు బాధాకరం. నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇలా మసిపూసి మారేడు కాయ చేయాలన్న వాళ్ల ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారు" అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.