Sharad Pawar: మాజీ ప్రధాని మన్మోహన్ పై పవార్ కీలక వ్యాఖ్యలు
- రైతుల సమస్యల పట్ల సున్నితంగా వ్యవహరించారని కితాబు
- రూ.72 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశారని వెల్లడి
- ప్రస్తుతం రైతులను పట్టించుకునే వారే లేరని ఆవేదన
రైతులు, సామాన్య ప్రజల సమస్యల పట్ల మన్మోహన్ సింగ్ సున్నితంగా వ్యవహరించే వారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. రైతుల విషయంలో మన్మోహన్ సింగ్ చాలా కేరింగ్ గా ఉండేవారని గుర్తుచేసుకున్నారు. తన హయాంలో మన్మోహన్ రైతుల రుణాలకు సంబంధించి రూ.72 వేల కోట్లను మాఫీ చేశారని చెప్పారు. ప్రస్తుతం రైతుల సమస్యలను పరిష్కరించడం మాట అటుంచి కనీసం వారి గోడును వినే నాథుడే లేకుండా పోయాడని పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు శనివారం పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే అప్పుడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ స్వయంగా అక్కడ పర్యటించారని పవార్ గుర్తుచేశారు. కాగా, ఈ కార్యక్రమంలో శరద్ పవార్ తో పాటు శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ థాక్రే, ఎంపీ సంజయ్ రౌత్, కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరట్, ఎన్సీపీ ఎంపీ, పవార్ కూతురు సుప్రియా సూలే తదితరులు హాజరయ్యారు.