Sachin Tendulkar: సచిన్ టెండ్కూలర్ ఒక గ్రహంతరవాసి.. ప్రశంసల జల్లు కురిపించిన దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు
- సచిన్ ఆడిన గొప్ప ఇన్నింగ్స్ చాలా చూశానన్న సౌతాఫ్రికా మాజీ ఆటగాడు అలీ బచర్
- ఎవరితోనూ గొడవలు పడని గొప్ప వ్యక్తిత్వం ఉన్న దిగ్గజమని ప్రశసంలు
- నేటి తరం ఆటగాళ్లలో కోహ్లీ గొప్ప ఆటగాడని కితాబిచ్చిన బచర్
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ రాణించిన నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ ఆటగాడు అలీ బచర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో రెండో ఇన్నింగ్స్‌లలో అద్భుతంగా రాణించిన ఆటగాళ్ల గురించి మాట్లాడుతూ టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. తాను ఎక్కువ గౌరవించే ఆటగాళ్లలో సచిన్ ఒకరని, సచిన్ ఆటను చూస్తుంటే వేరే గ్రహం నుంచి వచ్చి ఆడుతున్నట్టు అనిపిస్తుందని ప్రశంసించాడు. సచిన్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌లను తాను చాలా చూశానని, ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పదని అన్నాడు. ఎప్పుడైనా ఎవరితోనైనా గొడవ పడ్డాడని తాను భావించడంలేదని, ఇదంతా సచిన్ గొప్పతనమేనని కొనియాడాడు. ఇప్పటికీ సచిన్‌తో మాట్లాడుతూనే ఉంటానని చెప్పాడు. సచిన్ కంటే బ్రియాన్ లారా గొప్పవాడని ఆస్ట్రేలియన్లు భావిస్తుంటారని, కానీ దానంత చెత్త విషయం ఇంకోటి లేదన్నాడు. సచిన్ 140 కోట్ల మంది ప్రజలు ఉన్న దేశానికి ప్రాతినిధ్యం వహించాడని, అతడిపై ఎంత ఒత్తిడి ఉంటుందో అర్థం చేసుకోవాలని అలీ బచర్ గుర్తుచేశాడు. సచిన్ తర్వాత స్టీవ్ వా గౌరవిస్తానని అన్నాడు.
ఇక నేటి తరం క్రికెటర్లలో విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడని అలీ బచర్ ప్రశంసించాడు. కాగా సెంచూరియన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 76 పరుగులతో రాణించాడు. రెండో ఇన్నింగ్స్ భారత్ కేవలం 131 పరుగులకే ఆలౌట్ అవ్వగా అందులో 76 పరుగులు కోహ్లీవే ఉన్నాయి. మిగతా ఆటగాళ్లు దారుణంగా విఫలమైనా కోహ్లీ అలవోకగా బ్యాటింగ్ చేశాడు. 76 పరుగుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్న విషయం తెలిసిందే. ‘హిందుస్థాన్ టైమ్స్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బచర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.