France: మానవ అక్రమ రవాణా ఆరోపణలు.. ఫ్రాన్స్ నుంచి వచ్చిన 20 మందిని ప్రశ్నిస్తున్న గుజరాత్ పోలీసులు
- అక్రమ వలసల నెట్‌వర్క్‌ను వెలికి తీసే యత్నం చేస్తున్న సీఐడీ
- ఎంత అడిగినా నిజాలు చెప్పడం లేదంటున్న అధికారులు
- టూరిస్టులుగా వెళ్లామంటున్నారన్న సీఐడీ ఏడీజీ
- ఏజెంట్ కోసం గాలిస్తున్న అధికారులు
- లాటిన్ అమెరికా నుంచి అమెరికాలోకి అక్రమంగా చేరుకునే ప్లాన్‌పై ఆరా
మానవ అక్రమ రవాణా అనుమానంతో ఫ్రాన్స్ నుంచి తిరిగి వచ్చిన ప్రయాణికుల్లో 20 మందిని గుజరాత్ పోలీసులు ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి పనిచేస్తున్న అనుమానిత అక్రమ వలస నెట్‌వర్క్‌ను వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. లాటిన్ అమెరికా చేరుకున్న తర్వాత వీరంతా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే ప్రణాళిక ఏమైనా వీరివద్ద ఉందా? అన్న విషయమై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. వీరంతా నికరాగ్వాలో ల్యాండ్ అయిన తర్వాత అమెరికాలోకి అక్రమంగా వెళ్లే ప్లాన్ ఉన్నట్టు రూమర్లు ఉన్నాయని సీఐడీ ఏడీజీ ఎస్పీ రాజ్‌కుమార్ పేర్కొన్నారు.
అయితే, వారు మాత్రం తాము టూరిస్టులుగానే వెళ్లామని చెబుతున్నారని, వారి ట్రిప్ వెనక ఉన్న ఏజెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అయితే, ఎంత అడిగినా నిజాలు మాత్రం చెప్పడం లేదని, పర్యాటకులుగానే వెళ్లామని చెబుతున్నారని వివరించారు. 276 మంది ప్రయాణికులతో నికరాగ్వా వెళ్తున్న ఎయిర్‌బస్ ఏ340ని మానవ అక్రమ రవాణా ఆరోపణలతో ఫ్రాన్స్‌లో దించేసి నాలుగు రోజులపాటు నిలిపివేశారు. ఆ తర్వాత భారత ప్రభుత్వ ప్రయత్నాలతో ఈ నెల 26న విమానం ముంబై చేరుకుంది.