ISRO: వచ్చే ఐదేళ్లలో 50 నిఘా ఉపగ్రహాలు... చీమ చిటుక్కుమన్నా పసిగట్టనున్న భారత్!
- భౌగోళిక నిఘా వ్యవస్థను బలోపేతం చేయనున్న భారత్
- కీలక కార్యాచరణ రూపొందిస్తున్న ఇస్రో
- భారీ సంఖ్యలో నిఘా ఉపగ్రహాల మోహరింపుకు సన్నాహాలు
ఓ దేశ భద్రతలో నిఘా ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. సరైన నిఘా వ్యవస్థలు లేకపోతే పొంచి ఉన్న ముప్పులను పసిగట్టడం కష్టసాధ్యమవుతుంది. అందుకే ఈ అంశానికి భారత కేంద్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యతనిస్తోంది. గత కొన్నాళ్లుగా జరిగిన ఘటనల నేపథ్యంలో... పొరుగునే ఉన్న చైనా, పాకిస్థాన్ లపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకు అంతరిక్ష నిఘా కీలకం కానుందని భావిస్తోంది.
ఈ క్రమంలో, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రానున్న కాలంలో భారీ సంఖ్యలో నిఘా ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెట్టనుంది. దీనిపై ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ స్పందించారు.
ముంబయిలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.... భారత్ బలమైన దేశంగా ఎదగాలంటే ఉపగ్రహ సాధన సంపత్తి కూడా పెరగాలని, ఇప్పుడున్న ఉపగ్రహ వ్యవస్థల కంటే 10 రెట్లు అధికంగా ఉండాలని స్పష్టం చేశారు. దీనికోసమే రాబోయే ఐదేళ్లలో 50 నిఘా ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. భౌగోళిక నిఘా సమాచార సేకరణే ఈ ఉపగ్రహాల ప్రయోగం వెనుక ముఖ్య ఉద్దేశమని వివరించారు.
తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోగల సామర్థ్యం ఉండడమే ఓ దేశం బలాన్ని చాటుతుందని సోమనాథ్ అభిప్రాయపడ్డారు. అంతరిక్షంలో భారీ సంఖ్యలో నిఘా ఉపగ్రహాలను మోహరించడం ద్వారా రానున్న కాలంలో భారత భౌగోళిక నిఘా సామర్థ్యం ఇనుమడిస్తుందని, తద్వారా దేశానికి ఎదురయ్యే ముప్పు శాతాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు.
తాము ప్రయోగించే ఉపగ్రహాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నవని, సైనిక బలగాల కదలికలను పసిగట్టడం, వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో అత్యంత స్పష్టతతో ఛాయాచిత్రాలను అందించే సామర్థ్యం వాటి సొంతం అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వివరించారు.