CM Jagan: ప్యాకేజీ కోసం త్యాగాలు చేసే త్యాగరాజును దత్తపుత్రుడిలోనే చూస్తుంటాం: సీఎం జగన్

CM Jagan slams opposition leaders

  • భీమవరంలో విద్యా దీవెన కార్యక్రమం
  • హాజరైన సీఎం జగన్
  • భీమవరం ప్రజలు దత్తపుత్రుడిని తిరస్కరించారని వ్యాఖ్యలు
  • కార్లను మార్చినట్టు భార్యలను మార్చుతుంటాడని ఎద్దేవా
  • ఒక్క భార్యతోనూ మూడ్నాలుగేళ్లు కాపురం చేయడని వ్యంగ్యం

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ విపక్ష నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

ఇదే భీమవరంలో ప్రజలు దత్తపుత్రుడిని తిరస్కరించారని వెల్లడించారు. పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉండే దత్తపుత్రుడికి మన రాష్ట్రంలో అడ్రస్ లేదని, నాన్ లోకల్ అని విమర్శించారు. పక్క రాష్ట్రంలో నివాసం ఉండే దత్తపుత్రుడు పక్కవాడు సీఎం కావాలని పార్టీ పెట్టాడని, దేశం చరిత్రలో ఇలాంటి వాడు దత్తపుత్రుడు తప్ప మరొకరు లేరని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. 

బాబును ముఖ్యమంత్రిని చేయడమే ఈ దత్తపుత్రుడి లక్ష్యం అని, బాబుతో పొత్తును వ్యతిరేకించేవాళ్లు తన పార్టీలో ఉండనవసరంలేదని తన సభల్లో చెబుతున్నాడని అన్నారు. పొత్తులో భాగంగా బాబు ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే, అసలు ఏ సీటూ ఇవ్వకపోయినా ఓకే... చిత్తం ప్రభూ అనే ఈ త్యాగాల త్యాగరాజు మన దత్తపుత్రుడు అని సీఎం జగన్ వ్యంగ్యం ప్రదర్శించారు. 

ఎక్కడైనా ప్రజల కోసం త్యాగాలు చేసేవారిని చూస్తుంటాం... కానీ ప్యాకేజీ కోసం త్యాగాలు చేసే త్యాగాల త్యాగరాజును దత్తపుత్రుడిలో మాత్రమే చూడగలమని వ్యాఖ్యానించారు. 

"నిజ జీవితంలో ఈ పెద్ద మనిషి ఒక మ్యారేజి స్టార్. ఏ భార్యతోనూ ముచ్చటగా మూడ్నాలుగేళ్లయినా కాపురం చేసి ఉండడు. నాలుగేళ్లకోసారి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేస్తుంటాడు. కార్లను మార్చినట్టు భార్యలను మార్చుతుంటాడు. ఇప్పటికే ముగ్గురు భార్యలు అయిపోయారు! 

నాక్కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు... మనకు అక్కచెల్లెళ్లు ఉన్నారు... ఇలాంటి నేతలు సీఎంలు, ఎమ్మెల్యేలు అయితే వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే మన ఆడబిడ్డల పరిస్థితి ఊహించుకోగలమా? ఇలాంటి వాళ్లకు కనీసం ఓటు వేయడం కూడా ధర్మమా? అని అడుగుతున్నా. 

కనీసం ఒక్క భార్యతోనైనా మూడ్నాలుగేళ్లు కాపురం చేయలేనివాడు... రాజకీయాల్లో మాత్రం చంద్రబాబుతో కనీసం పది పదిహేనేళ్లు కొనసాగాల్సిందేనని తన పార్టీ వారికి హితోపదేశం చేస్తున్నాడు" అంటూ సీఎం జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు.

CM Jagan
YSRCP
Vidya Deevena
Bhimavaram
West Godavari District
Andhra Pradesh

More Telugu News