Nara Lokesh: నారా లోకేశ్ చెపుతున్న రెడ్ బుక్ పై ఏపీ డీజీపీ ఏమన్నారంటే..!
- ఎవరు ఎవరికైనా రెడ్ బుక్ ఇవ్వొచ్చన్న ఏపీ డీజీపీ
- రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని వెల్లడి
- మహిళలపై నేరాలకు పాల్పడుతున్న వారు కూడా భయపడుతున్నారని వ్యాఖ్య
రాష్ట్రంలో నేరాలు తగ్గిపోవాలి.. నేరాలకు పాల్పడుతున్న వారికి శిక్షలు పడాలి అనే లక్ష్యంతో పోలీసు శాఖ కఠినమైన చర్యలు తీసుకుంటోందని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. తమ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. కన్విక్షన్ బేస్డ్ విధానాన్ని ఏడాది క్రితం తీసుకొచ్చామని... ఈ విధానం వల్ల 66 శాతం కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయని తెలిపారు. ఈ ఏడాది నేరాలు 8.13 శాతం మేర తగ్గుముఖం పట్టాయని చెప్పారు. కోర్టులు మరణ శిక్షలు విధిస్తుండటంతో మహిళలపై నేరాలకు పాల్పడుతున్న వారు భయపడుతున్నారని తెలిపారు. నేరాలను అరికట్టడానికి జిల్లా ఎస్పీల నుంచి కానిస్టేబుల్ వరకు అందరూ కష్టపడుతున్నారని చెప్పారు.
మూడేళ్లలో 5 లక్షల కిలోల గంజాయిని ధ్వంసం చేశామని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో 4,900 మంది రౌడీలు ఉన్నారని చెప్పారు. వీరిలో వెయ్యి మందికి కోర్టులు శిక్షలు విధించాయని... మిగిలిన వారిపై నిరంతరం నిఘా ఉంచామని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టేవారు కూడా దాదాపుగా దారిలోకి వచ్చారని చెప్పారు. 55 మంది వారి అకౌంట్లను కూడా మూసేసుకున్నారని తెలిపారు. టీడీపీ యువనేత నారా లోకేశ్ చెపుతున్న రెడ్ బుక్ పై స్పందిస్తూ... ఎవరు ఎవరికైనా రెడ్ బుక్ ఇవ్వొచ్చని చెప్పారు. అక్రమ కేసులు నమోదు చేస్తూ, టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లను రెడ్ బుక్ లో రాస్తున్నానని లోకేశ్ చెపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ల సంగతి తేలుస్తామని ఆయన బహిరంగంగా హెచ్చరిస్తున్నారు.