President Putin: ప్రధాని మోదీని తమ దేశానికి ఆహ్వానించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఆసక్తికర వ్యాఖ్యలు
- 'మా స్నేహితుడిని చూసి సంతోషిస్తాం' అంటూ విదేశాంగమంత్రి జైశంకర్‌తో చెప్పిన రష్యా అధినేత
- ఇరుదేశాల మధ్య వాణిజ్య టర్నోవర్ పెరిగిందన్న పుతిన్
- రష్యాలో ఐదు రోజుల అధికారిక పర్యటనలో ఉన్న జైశంకర్‌తో భేటీ
వచ్చే ఏడాది రష్యాలో పర్యటించాలంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానించారు. ‘రష్యాలో మా స్నేహితుడిని చూసి సంతోషిస్తాం’ అంటూ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. ఐదు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా రష్యాలో ఉన్న భారత విదేశాంగమంత్రి జైశంకర్‌తో భేటీ సందర్భంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, రష్యా మధ్య వాణిజ్య టర్నోవర్ వృద్ధి చెందుతోందని ఆయన ప్రస్తావించారు. ముడి చమురు, అత్యాధునిక టెక్నాలజీ రంగాలు ఇందుకు ప్రధానంగా దోహదపడుతున్నాయని పుతిన్ అన్నారు. వరుసగా రెండవ సంవత్సరం చక్కటి వృద్ధి నమోదయిందని, గతేడాదితో పోల్చితే మరింత మెరుగుదల ఉందని ప్రస్తావించారు.
మరోవైపు రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో కూడా జైశంకర్ సమావేశమయ్యారు. అనంతరం ఇద్దరూ సంయుక్త మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే ఏడాది జరగనున్న వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ హాజరవుతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు అధినేతలు తరచూ సంప్రదింపులు జరుపుతూనే ఉంటారని జైశంకర్ అన్నారు.
కాగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో భారత ప్రధాని, రష్యా అధ్యక్షుల మధ్య జరిగే శిఖరాగ్ర సమావేశాలు అత్యంత కీలకంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఇరుదేశాల మధ్య 21 వార్షిక శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. చివరి సమావేశం 2021 డిసెంబర్‌లో న్యూఢిల్లీలో జరిగింది. వచ్చే ఏడాది సదస్సు రష్యాలో జరగనుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో కూడా ఇరు దేశాల సంబంధాలు బలంగానే ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని భారత్ ఖండించలేదు. దౌత్యపరమైన చర్చల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించాలని సూచించిన విషయం తెలిసిందే.