Hyderabad: వరల్డ్ బెస్ట్ ఫుడ్ నగరాల టాప్-50లో హైదరాబాద్

Hyderabad gets place in world best food cities top 50

  • రుచికరమైన ఆహారం దొరికే నగరాల జాబితా రూపొందించిన టేస్ట్ అట్లాస్
  • హైదరాబాద్ కు 39వ స్థానం... 35వ స్థానంలో ముంబయి
  • ఢిల్లీకి 56, చెన్నైకి 65, లక్నోకు 92వ ర్యాంకు
  • మొదటి స్థానంలో ఇటలీ రాజధాని రోమ్

హైదరాబాద్ లో లభించే దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కట్లు, హలీమ్... ప్రపంచవ్యాప్తంగా ఎంతటి గుర్తింపు సంపాదించుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్ వచ్చిన వారు వీటిని ఒక్కసారి టేస్ట్ చేస్తే ఇక వదలరు. అందుకే, హైదరాబాద్ నగరానికి బెస్ట్ ఫుడ్ సిటీస్ జాబితాలో చోటు లభించింది. 

టేస్ట్ అట్లాస్ రూపొందించిన ఈ ప్రపంచ నగరాల జాబితా టాప్-50లో హైదరాబాద్ కు 39వ స్థానం లభించింది. టాప్-50లో ముంబయి కూడా ఉంది. ముంబయికి 35వ స్థానం లభించింది. ఢిల్లీ నగరానికి 56, చెన్నై నగరానికి 65, లక్నోకు 92వ ర్యాంకు దక్కాయి. 

ముంబయి, ఢిల్లీ నగరాల్లో స్ట్రీట్ ఫుడ్ ఎంతో ఫేమస్. ముఖ్యంగా, ఈ రెండు నగరాల్లో చాట్ లు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇక చెన్నై గురించి తెలిసిందే. ఇడ్లీ, దోసె, పొంగల్ వంటి అల్పాహారాలకు, సాంబార్ కు ఎంతో ప్రసిద్ధికెక్కింది. యూపీ రాజధాని లక్నో నగరంలో దొరికే నాన్ వెజ్ వంటకాలకు ఫిదా అవని వారంటూ ఉండరు. ఇక్కడ లభించే మొఘలాయి వంటకాలు విదేశీయులను సైతం విశేషంగా ఆకర్షిస్తుంటాయి. 

టేస్ట్ అట్లాస్ రూపొందించిన ఈ వరల్డ్ బెస్ట్ ఫుడ్ సిటీస్ జాబితాలో ఇటలీ రాజధాని రోమ్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో నిలిచిన నగరాలు కూడా ఇటలీలోనివే కావడం విశేషం. బొలోగ్నా నగరానికి 2వ ర్యాంకు, నేపుల్స్ సిటీకి 3వ ర్యాంకు లభించాయి. ఈ ఇటలీ నగరాలు పాస్తాలు, పిజ్జాలు, ఛీజ్ తో తయారయ్యే వంటకాలకు పెట్టింది పేరు.

Hyderabad
World Best Food Cities
Taste Atlas
Food
  • Loading...

More Telugu News