Suriya: మొన్న రామ్ చరణ్... నేడు సూర్య... ఐఎస్పీఎల్ లో జట్టు కొనుగోలు
- భారత్ లో మరో క్రికెట్ లీగ్
- త్వరలోనే ఐఎస్పీఎల్ టీ10 సీజన్-1
- ఆరు జట్లతో టోర్నీ
- ఇప్పటికే జట్లను కొనుగోలు చేసిన రామ్ చరణ్, అమితాబ్, అక్షయ్, హృతిక్
- చెన్నై జట్టును సొంతం చేసుకున్న సూర్య
భారత్ లో మరో క్రికెట్ లీగ్ పురుడు పోసుకుంటోంది. దీని పేరు ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్). ఇది టీ10 క్రికెట్ లీగ్. ఈ లీగ్ పై సినీ తారలు ఆసక్తి చూపిస్తుండడం విశేషం. ఐఎస్పీఎల్ లో ఇప్పటికే హైదరాబాద్ జట్టును రామ్ చరణ్ కొనుగోలు చేశారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముంబయి జట్టును, అక్షయ్ కుమార్ శ్రీనగర్ జట్టును, హృతిక్ రోషన్ బెంగళూరు జట్టును కొనుగోలు చేశారు.
ఇప్పుడీ జాబితాలో తమిళ స్టార్ హీరో సూర్య కూడా చేరారు. సూర్య చెన్నై ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని సూర్యానే స్వయంగా వెల్లడించారు.
"నమస్తే చెన్నై... ఐఎస్పీఎల్ టీ10 లీగ్ టీమ్ చెన్నైని సొంతం చేసుకున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. క్రికెట్ ప్రేమికులందరం కలిసి క్రీడాస్ఫూర్తి, నైపుణ్యం కలగలసిన ఒక బలమైన వారసత్వాన్ని సృష్టిద్దాం" అని పిలుపునిచ్చారు.
కాగా, ఇది టెన్నిస్ బాల్ టోర్నీ. ఆసక్తి ఉన్న వారు https://ispl-t10.com/ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూర్య సూచించారు.
ఐఎస్పీఎల్ టోర్నీలో తొలి సీజన్ 2024 మార్చి 2 నుంచి 9వ తేదీ వరకు జరగనుంది. ఈ పోటీలను టెన్నిస్ బాల్ తో నిర్వహిస్తారు. ఈ లీగ్ లో హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్ కతా, బెంగళూరు, శ్రీనగర్ జట్లు పాల్గొంటాయి.