Japan Nuclear Plant: పుష్కరకాలం తర్వాత తిరిగి తెరుచుకుంటున్న ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం
- ప్రపంచంలోనే అతిపెద్దదైన అణువిద్యుత్ కేంద్రంగా కషివాజకి-కరివా ప్లాంట్
- రెండేళ్ల క్రితం విధించిన ఆపరేషనల్ బ్యాన్‌ను ఎత్తివేసిన జపాన్ న్యూక్లియర్ పవర్ రెగ్యులేటర్
- 2011 ఫుకుషిమా విపత్తు తర్వాత మూతబడిన అన్ని అణుకేంద్రాలను మూసేసిన జపాన్
12 ఏళ్ల క్రితం మూతపడిన ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అణుకేంద్రాన్ని తెరిచేందుకు జపాన్ రెడీ అయింది. టోక్యో ఎలక్ట్రిక్ పవర్ (టెప్కో)కు చెందిన కషివాజకి-కరివా పవర్ ప్లాంట్‌పై రెండేళ్ల క్రితం విధించిన ఆపరేషనల్ బ్యాన్‌ను జపాన్ న్యూక్లియర్ పవర్ రెగ్యులేటర్ ఎత్తివేసి ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించేందుకు అనుమతినిచ్చింది.
ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఈ అణువిద్యుత్ కేంద్రాన్ని తిరిగి తెరవడం ద్వారా నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలని జపాన్ భావిస్తోంది. అయితే, జపాన్ తీరంలోని నీగటా ప్రిఫెక్చర్ (పాలనా అధికార పరిధి)లో ఉన్న ఈ ప్లాంట్ తిరిగి తెరవాలంటే మాత్రం స్థానిక సమ్మతి కూడా అవసరం. 8,212 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ 2011 నుంచి మూతబడింది. ఫుకుషమా విపత్తు తర్వాత జపాన్ అన్ని అణువిద్యుత్ కేంద్రాలను మూసివేసింది. అప్పటి నుంచి మూతలోనే ఉన్న ఈ కేంద్రం త్వరలోనే తిరిగి తెరుచుకోనుంది.