Ambati Rambabu: వంగవీటి రంగాను చంపింది టీడీపీ ప్రభుత్వమే: అంబటి రాంబాబు
- వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న అంబటి రాంబాబు
- పదవులు ముఖ్యం కాదని వెల్లడి
- పదవులు, వస్తాయి పోతాయి... మాట ముఖ్యం అంటూ వ్యాఖ్యలు
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వంగవీటి రంగాను చంపింది నాటి టీడీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. దాంతో, ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పట్టుబట్టి, కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకువచ్చారని వెల్లడించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరు నేతలు మారడం, మళ్లీ ఎన్టీఆర్ అధికారంలోకి రావడం జరిగిందని అంబటి రాంబాబు వివరించారు.
అప్పట్లో తాను తొలిసారిగా కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచానని, మళ్లీ 2019లో ఎమ్మెల్యేగా గెలిచానని, ఈ మధ్యలో ఖాళీగానే ఉన్నానని తెలిపారు. ఇప్పుడు తనపై పోటీ చేస్తున్న నేత (కన్నా) కూడా గతంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారని వెల్లడించారు.
"వంగవీటి రంగాను చంపింది టీడీపీయేనని అతడు అనేక సందర్భాల్లో అన్నాడు. అసలు, రంగాను చంపింది చంద్రబాబేనని డైరెక్ట్ గా అన్నాడు. రంగాను చంపడమే కాకుండా, తనను కూడా చంపాలని ప్రయత్నించాడని ఆ నేత చెప్పాడు. రంగా గారిని చంపగలిగాడు కానీ, నన్ను చంపలేకపోయాడు అని ఆ నేత చెప్పాడు. ఇవాళ ఏం జరుగుతోంది రాజకీయాల్లో? పదవే శాశ్వతమా? పదవి కోసం పాకులాడడమే ముఖ్యమా? పదవి కోసం పాకులాడేవాడ్ని సమాజం క్షమించదు.
నేను గతంలో కాంగ్రెస్ లో ఉన్నాను. వైఎస్ చనిపోగానే జగన్ వెంట నడిచాను. పదవి కోసమే నడిచానా? ఆ రోజు జగన్ సీఎం అవుతారని ఎవరైనా ఊహించారా? నమ్ముకున్న సిద్ధాంతం కోసం, ప్రేమ కోసం, అభిమానం కోసం, మాట కోసం పనిచేస్తుంటే పదవులు వస్తాయి, పోతాయి... అది వేరే విషయం" అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.