paidi rakesh reddy: రేవంత్ రెడ్డి, నేను సమానమే... చట్టం తన పని చేయకుంటే ఇక నా చట్టం ప్రారంభిస్తా..!: ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి హెచ్చరిక

Armoor BJP MLA warning to CM Revanth Reddy

  • రేవంత్ రెడ్డికి, తనకూ సమాన హక్కులుంటాయన్న బీజేపీ ఎమ్మెల్యే
  • కొడంగల్ ప్రజలు ఆయనను గెలిపిస్తే, ఆర్మూర్ ప్రజలు తనను గెలిపించారని వ్యాఖ్య
  • ఓడిపోయినవారు అధికారులతో రివ్యూ చేయాలని సీఎం ఎలా చెబుతారని ప్రశ్నించిన రాకేశ్ రెడ్డి 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తనకూ... ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని కొడంగల్ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే... తనను ఆర్మూర్ అసెంబ్లీ ప్రజలు గెలిపించారని గుర్తుంచుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అహంకారం తలకెక్కిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి, తాను .. ఇద్దరమూ సమానమేనని.. సమాన హక్కులు ఉంటాయన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

ఓడిపోయినవారు అధికారులతో రివ్యూ చేయాలని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండి ఎందుకు? ఓడిపోయిన వారు రివ్యూలు చేయడమేమిటి? అని అన్నారు. అలా అయితే తామూ పాత ముఖ్యమంత్రి, పాత మంత్రుల వద్ద రివ్యూ చేసుకుంటామని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి... మా ఆత్మగౌరవాన్ని తగ్గిస్తే.. తామూ ఆయన ఆత్మగౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడుతామని హెచ్చరించారు. ఆర్మూర్‌లో ఓడిపోయిన వినయ్ రెడ్డి.. అధికారులను, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు. వినయ్ రెడ్డి ప్రజాస్వామ్యయుతంగా రాజకీయం చేయాలని, లేదంటే ఆర్మూర్ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఇక్కడ చట్టం తన పని తాను చేయకపోతే ఇక ఆర్మూర్‌లో రాకేశ్ రెడ్డి చట్టం ప్రారంభమవుతుందని గట్టి వార్నింగ్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News