Sanjay Singh: ప్రధానితో మాట్లాడతా: సస్పెన్షన్ కు గురైన భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు సంజయ్ సింగ్

Suspended WFI President Sanjay Singh says they did not breach code at all

  • భారత రెజ్లింగ్ సమాఖ్యకు నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్
  • జూనియర్ టోర్నీలు ప్రకటించిన సమాఖ్య
  • ఇది నిబంధనలకు విరుద్ధమన్న కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ
  • తాము నిబంధనలు అతిక్రమించలేదన్న సంజయ్ సింగ్

నూతనంగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కార్యవర్గాన్ని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ రద్దు చేయడం తెలిసిందే. అంతేకాదు, అడ్ హాక్ కమిటీ ఏర్పాటు చేసి భారత రెజ్లింగ్ వ్యవహారాలను పర్యవేక్షించాలంటూ భారత్ ఒలింపిక్ సంఘానికి సూచించింది. ఈ నేపథ్యంలో, తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనూ, క్రీడల మంత్రితోనూ మాట్లాడతానని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ వెల్లడించారు.

నిర్ణయాలు తీసుకోవడంలో ఎలాంటి నిబంధనలను అతిక్రమించలేదని, సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరతామని తెలిపారు. తమకు మరికొంత సమయం ఇవ్వాలని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖను అర్థిస్తున్నామని, సస్పెన్షన్ ను తొలగించాలన్నది తమ విజ్ఞప్తి అని తెలిపారు. అప్పటికీ ఈ వ్యవహారం పరిష్కారం కాకపోతే న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నామని సంజయ్ సింగ్ పేర్కొన్నారు. 

అండర్-15, అండర్-20 జాతీయ టోర్నీలను ప్రకటించడంలో భారత రెజ్లింగ్ సమాఖ్య నిబంధనలు పాటించడంలేదని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆరోపిస్తోంది. నిబంధనల ప్రకారం టోర్నీకి సిద్ధమయ్యేందుకు క్రీడాకారులకు కనీసం 15 రోజుల సమయం ఉండాలని, కానీ అంత వ్యవధి ఇవ్వకుండానే టోర్నీ ప్రకటించారంటూ రెజ్లింగ్ సమాఖ్యపై కేంద్రం సస్పెన్షన్ వేటు వేసింది.

దీనిపై రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు సంజయ్ సింగ్ స్పందిస్తూ, తాము నిబంధనలను ఉల్లంఘించలేదన్న విషయాన్ని కేంద్రానికి వివరిస్తామని తెలిపారు. అందుకు ఆధారాలు కూడా సమర్పిస్తామని వివరించారు. 24 రాష్ట్రాల రెజ్లింగ్ సంఘాల ఆమోదంతోనే టోర్నీలపై తాము నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ప్రతిదీ లిఖితపూర్వకంగా ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News