Dayanidhi Maran: ఆ రాష్ట్రాల వాళ్లు తమిళనాడులో టాయిలెట్లు కడుగుతుంటారు: దయానిధి మారన్
- దయానిధి మారన్ వ్యాఖ్యలు వివాదాస్పదం
- యూపీ, బీహార్ నుంచి వచ్చేవాళ్లు తమిళనాడులో కార్మికులుగా ఉన్నారన్న మారన్
- భవన నిర్మాణ కార్మికులుగా, టాయిలెట్ క్లీనర్లుగా ఉన్నారని వ్యాఖ్యలు
- మండిపడిన బీజేపీ
ఉత్తర భారతదేశానికి, తమిళనాడుకు మధ్య సాంస్కృతిక వైరుధ్యాలు తీవ్రస్థాయిలో ఉంటాయని తెలిసిందే. ముఖ్యంగా భాషాపరమైన వివాదాలు ఎప్పటినుంచో ఉన్నాయి. హిందీని తమిళులు ఏమాత్రం అంగీకరించే పరిస్థితి లేదు!
కాగా, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో ఇప్పుడు తెరపైకి వచ్చింది. యూపీ, బీహార్ ల నుంచి వచ్చేవాళ్లు తమిళనాడులో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తుంటారని, టాయిలెట్లు కడుగుతుంటారని దయానిధి మారన్ అన్నారు.
సుందర్ పిచాయ్ తమిళనాడు వ్యక్తి అని, ఇప్పుడు గూగుల్ ను నడిపిస్తున్నాడని గర్వంగా చెప్పారు. ఒకవేళ సుందర్ పిచాయ్ గనుక హిందీ నేర్చుకుని ఉంటే ఇక్కడే భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ ఉండేవాడని దయానిధి మారన్ వ్యాఖ్యానించారు.
తమిళనాడులో చిన్నప్పటినుంచే ఇంగ్లీషు నేర్పించడం వల్ల వారు ఐటీ రంగంలో ఉద్యోగాలు సాధించి మంచి వేతనాలు పొందుతున్నారని వివరించారు. కాగా, దయానిధి మారన్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు.
డీఎంకే నేతలపైనా, ఇండియా కూటమి పెద్దలపైనా పూనావాలా విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలో మరోసారి విభజన రాజకీయాలు చేసే ప్రయత్నం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొదట రాహుల్ గాంధీ ఉత్తరాది ఓటర్లను అవమానించారని, ఆ తర్వాత రేవంత్ రెడ్డి బీహార్ డీఎన్ఏను విమర్శించారని, డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ గోమూత్ర రాష్ట్రాలు అని నోరుపారేసుకున్నారని పూనావాలా వివరించారు. ఇప్పుడు దయానిధి మారన్ చేసింది కూడా అదేనని, హిందీ మాట్లాడే ఉత్తరాది ప్రజలను అవమానించాడని ఆరోపించారు.
హిందువులను నోటికొచ్చినట్టు మాట్లాడడం, సనాతన ధర్మాన్ని కించపర్చడం ఇండియా కూటమి డీఎన్ఏలోనే ఉన్నట్టుందని విమర్శించారు. అంతేకాదు, ఇండియా కూటమిలో ఉన్న జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ విధానాల వల్లే బీహారీలు తమిళనాడుకు వలస వెళ్లాల్సి వస్తోందని షెహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు.