Sanjay Singh: భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన కార్యవర్గాన్ని సస్పెండ్ చేసిన కేంద్రం
- భారత రెజ్లింగ్ రంగంలో ఆసక్తికర పరిణామం
- సంజయ్ సింగ్ కార్యవర్గంపై కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ అసంతృప్తి
- నిబంధనలు ఉల్లంఘించారంటూ చర్యలు
భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యాడో లేదో... భారత రెజ్లర్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడం తెలిసిందే. సాక్షి మాలిక్ రెజ్లింగ్ కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించగా, భజరంగ్ పునియా తన పద్మశ్రీ పతకాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించాడు.
గతంలో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా వ్యవహరించి, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు సంజయ్ సింగ్ సన్నిహితుడు కావడమే దీనంతటికీ కారణం.
ఈ క్రమంలో, కేంద్ర ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్యలో నూతనంగా ఎన్నికైన సంజయ్ సింగ్ కార్యవర్గాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నూతన కార్యవర్గం నిబంధనలు పాటించడంలో విఫలమైందని ఆరోపించింది.
జాతీయస్థాయి జూనియర్ రెజ్లింగ్ పోటీలు ఈ నెలాఖరులో ప్రారంభం అవుతాయని సంజయ్ సింగ్ డిసెంబరు 21న ప్రకటించారని, నియామవళి ప్రకారం ఓ టోర్నీ ప్రారంభ తేదీకి కనీసం 15 రోజుల ముందు ప్రకటన చేయాల్సి ఉంటుందని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ వివరించింది. సంజయ్ చేసిన ప్రకటనతో రెజ్లర్లు టోర్నీకి సిద్దమయ్యేందుకు తగినంత సమయం లేకుండా పోయిందని, ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.
అంతేకాదు, భారత రెజ్లింగ్ సమాఖ్య పూర్తిగా గత కార్యవర్గం అదుపాజ్ఞల్లోనే పనిచేస్తున్నట్టుందని కేంద్రం పేర్కొంది.