Ponguleti Srinivas Reddy: అధికారులు పద్ధతి మార్చుకోవాలి.. లేదంటే కనుసైగలతో పంపించేస్తా!: మంత్రి పొంగులేటి

Minister Ponguleti warns officers

  • పాలేరులో లంచం తీసుకుని పోస్టింగ్ ఇవ్వడం ఉండదని చెప్పిన పొంగులేటి
  • అధికారులను ఎవరినీ బదిలీ చేయమని.. వారు పద్ధతి మార్చుకోవాలని సూచన
  • నమ్ముకున్న కార్యకర్తలను కాపాడుకుంటానన్న పొంగులేటి

అధికారులు తన జ్ఞానేంద్రియాలని... వారు ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేస్తే తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలా ఉన్నా పాలేరులో మాత్రం లంచం తీసుకొని పోస్టింగ్ ఇవ్వడం ఉండదని స్పష్టం చేశారు. అధికారులు కూడా రూపాయి ఆశించకుండా ప్రజలకు పనులు చేసి పెట్టాలని సూచించారు. అధికారులను ఎవరినీ బదిలీ చేయమని.. కానీ వారు పద్ధతి మార్చుకొని విధులు నిర్వహించాలని సూచించారు. లేదంటే.. కనుసైగతో వాళ్లంతట వాళ్లే వెళ్లే విధంగా చేస్తానన్నారు. తన పరిపాలనలో మాటలు ఉండవని, కేవలం కనుసైగలేనని హెచ్చరించారు. 

శనివారం పాలేరులోని కూసుమంచి మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్ని కుట్రలు పన్నినా... ఎన్ని శక్తులు ఎదురైనా మీ అందరి దీవెనలతో గెలిచానన్నారు. ఎన్నికల సమయంలో అనేక గ్రామాల్లో ఇచ్చిన వాగ్దానాలను త్వరలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. చాలామంది ధరణితో ఇబ్బందులు పడుతున్నారన్నారు. తనను నమ్ముకున్న ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. నమ్ముకున్న కార్యకర్తకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని.. తాము కక్షపూరిత రాజకీయాలకు పాల్పడమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. గతంలో కొంతమందిపై కేసులు పెట్టించారని.. వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో ప్రజలు తీపి వార్త వింటారన్నారు.

Ponguleti Srinivas Reddy
Congress
Telangana
  • Loading...

More Telugu News