Undavalli Arun Kumar: నాడు జగన్ లో ఉన్న ఫీలింగే ఇప్పుడు టికెట్ మార్చిన ఎమ్మెల్యేల్లో ఉంది: ఉండవల్లి అరుణ్ కుమార్
- రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా సమావేశం
- ఒక చోట గెలిచిన ఎమ్మెల్యేను మరో చోటికి మార్చడం చాలా కష్టమైనదని వెల్లడి
- ఇది ఎంతో జాగ్రత్తగా చేయాల్సిన పని అంటూ వ్యాఖ్యలు
- కానీ జగన్ ఆలోచనలు అలా లేవని వివరణ
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రిలో నేడు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేకు మరో చోట టికెట్ మార్చడం ఎంతో కష్టమైన పని అని, ఇది ఎంతో జాగ్రత్తగా చేయాల్సిన పని అని స్పష్టం చేశారు. కానీ జగన్ ఆలోచనలు చూస్తే అలా కనిపించడంలేదని అన్నారు.
గతంలో తనను సీఎం చేయాలని సోనియాను స్వయంగా అడిగినప్పుడో, ఇతరులతో అడిగించినప్పుడో జగన్ లో ఎలాంటి ఫీలింగ్ ఉందో... ఇప్పుడు టికెట్ మార్చిన ఎమ్మెల్యేల్లోనూ అలాంటి బాధాకరమైన ఫీలింగే ఉందని ఉండవల్లి వివరించారు.
అధికారం అంతా జగన్ కు, వాలంటీర్లకు మధ్యనే ఉందని, మరి ఎమ్మెల్యేలకు అధికారం ఎక్కడుందని ఉండవల్లి ప్రశ్నించారు. అధికారం లేకుండా ఎమ్మెల్యేలకు గ్రాఫ్ పెరగలేదంటే ఎలా? అని వ్యాఖ్యానించారు.
వైఎస్ పేరుతో పార్టీ ఏర్పాటు చేసి, లక్ష్యాలు, ఆశయాలకు దూరంగా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే పార్టీ మనుగడే ప్రమాదంలో పడుతుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.