NRI Yash Bodduluri: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ ఎన్ఆర్ఐ నేత యశ్ అరెస్ట్.. మండిపడ్డ నారా లోకేశ్
- అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు వచ్చిన యశ్
- శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు
- అక్రమ కేసులు నమోదు చేసి, టెర్రరిస్ట్ మాదిరి అరెస్ట్ చేశారని లోకేశ్ మండిపాటు
టీడీపీ ఎన్ఆర్ఐ నేత యశ్ బొద్దులూరిని ఏపీ సీఐడీ పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసేందుకు వచ్చిన ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి మంగళగిరిలోని కార్యాలయానికి తరలించారు. ఆయనపై లుకౌట్ నోటీసులు ఉన్నట్టు తెలుస్తోంది. యశ్ అరెస్ట్ పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
యశ్ బొద్దులూరిపై ఏపీలో అక్రమ కేసులు నమోదు చేశారని... నిన్న రాత్రి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనను అరెస్ట్ చేశారనే విషయం తెలిసి షాక్ కు గురయ్యానని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు. క్రూరమైన ఈ ప్రభుత్వం అరెస్టులు, నిర్బంధాలతో ప్రశ్నించే గొంతులను అణచివేయాలనుకుంటోందని మండిపడ్డారు. ఒక టెర్రరిస్టు మాదిరి ఆయనను అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. యశ్ కి న్యాయం జరిగేంత వరకు విశ్రమించబోమని చెప్పారు. వైసీపీకి చివరి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.