Talaq: సోదరుడికి కిడ్నీ ఉచితంగా ఇచ్చేస్తోందని మహిళకు తలాక్ చెప్పిన ఘనుడు

 Man said Talaq to wife after she decided to donate kidney to her brother

  • ఉత్తరప్రదేశ్ లో ఘటన
  • అనారోగ్యం పాలైన మహ్మద్ షకీర్
  • షకీర్ కు కిడ్నీ దానం చేయాలని నిర్ణయించుకున్న తరానుమ్
  • ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన భర్త అబ్దుల్ రషీద్
  • రూ.40 లక్షలు తీసుకుని కిడ్నీ ఇవ్వాలని భార్యపై ఒత్తిడి
  • వ్యతిరేకించిన తరానుమ్... వాట్సాస్ లో తలాక్ చెప్పేసిన భర్త

ఉత్తరప్రదేశ్ లోని గోండా ప్రాంతంలో ఓ మహిళ తీవ్ర అనారోగ్యం పాలైన తన సోదరుడికి తన కిడ్నీ దానం చేయాలని నిర్ణయించుకుంది. అయితే, డబ్బు తీసుకోకుండా కిడ్నీ ఉచితంగా ఇచ్చేస్తుండడంతో ఆగ్రహించిన ఆమె భర్త తలాక్ చెప్పేశాడు. 

ఆమె పేరు తరానుమ్  (40). ఆమె భర్త పేరు అబ్దుల్ రషీద్ (44). అతడు ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాలో ఉంటున్నాడు. కాగా, తరానుమ్ సోదరుడు మహ్మద్ షకీర్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. అతడు ముంబయిలో చికిత్స పొందుతున్నాడు. కిడ్నీ మార్చాలని అక్కడి డాక్టర్లు చెప్పారు. 

సోదరుడి కోసం తన కిడ్నీ ఇచ్చేందుకు తరానుమ్ ముందుకొచ్చింది. అయితే, ఆమె భర్త అబ్దుల్ రషీద్ ఉచితంగా కిడ్నీ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. రూ.40 లక్షలు తీసుకుని కిడ్నీ ఇవ్వాలని భార్యపై ఒత్తిడి తెచ్చాడు. కానీ, తోబుట్టువు వద్ద డబ్బులు తీసుకునేందుకు తరానుమ్ అంగీకరించలేదు. తాను డబ్బులు తీసుకోనని సౌదీ అరేబియాలో ఉన్న భర్తకు తెగేసి చెప్పింది. 

దాంతో అబ్దుల్ కు విపరీతమైన ఆగ్రహం వచ్చింది. వెంటనే వాట్సాప్ ద్వారా మూడుసార్లు తలాక్ చెప్పేశాడు. అయితే, తరానుమ్ దీనిపై పోలీసులను ఆశ్రయించింది. భర్త తలాక్ చెప్పాడంటూ ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. పోలీసు అధికారి శిల్పా వర్మ దీనిపై స్పందిస్తూ... ముస్లిం మహిళల రక్షణ చట్టం-2019 ప్రకారం అబ్దుల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వెల్లడించారు. అంతేకాదు, వరకట్న నిషేధ చట్టం, ఇతర సెక్షన్లను కూడా అతడిపై మోపినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News