Sakshi Malik: రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్ ‘నామినీ’.. రెజ్లింగ్‌కు సాక్షి మలిక్ కన్నీటి వీడ్కోలు
- డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా సంజయ్‌సింగ్
- 15 స్థానాల్లో 13 స్థానాలను దక్కించుకున్న సంజయ్ వర్గం
- తమ పోరాటానికి విలువ లేకుండా పోయిందంటూ రెజ్లర్ల ఆవేదన
- మళ్లీ బరిలోకి దిగేదిలేదంటూ షూస్ టేబుల్‌పై పెట్టి వెళ్లిపోయిన సాక్షి మలిక్
భారత స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్ కెరియర్‌కు కన్నీటి వీడ్కోలు పలికింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్‌గా క్రీడాకారిణిలను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్ ‘నామినీ’ సంజయ్‌సింగ్ ఎన్నికవడంతో సాక్షి ఈ నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ సమాఖ్యకు నిన్న జరిగిన ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి అనితా షెరాన్‌పై యూపీకి చెందిన సంజయ్ ఏకపక్ష విజయం అందుకొన్నారు. సంజయ్‌కు 40 ఓట్లు, అనితకు ఏడు ఓట్లు లభించాయి. అనిత వర్గానికి చెందిన ప్రేమ్‌చంద్ కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవి దక్కించుకున్నారు. మొత్తం 15 స్థానాల్లో 13 స్థానాలను సంజయ్ వర్గం తన ఖాతాలో వేసుకుంది.
బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ ‘నామినీ’ సంజయ్‌సింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా ఎన్నికవడాన్ని రెజ్లర్లు సాక్షి మలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్ తీవ్రంగా వ్యతిరేకించారు. మీడియా సమావేశంలో సాక్షి మాట్లాడుతూ.. కెరియర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు తెలిపారు. బ్రిజ్‌భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ అధ్యక్ష పదవికి ఎన్నిక కావడాన్ని నిరసిస్తూ కెరియర్‌ను ముగిస్తున్నట్టు కన్నీటితో తెలిపారు. మళ్లీ తాను బరిలోకి దిగబోనని ప్రతిజ్ఞ చేస్తూ షూస్‌ను టేబుల్‌పై పెట్టి మధ్యలోనే కన్నీళ్లు తుడుచుకుంటూ బయటకు వెళ్లిపోయింది. తాము ఎవరిపై పోరాడామో వారే తిరిగి అధ్యక్ష పదవిలోకి రావడాన్ని సమర్థించబోమని బజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్ పేర్కొన్నారు. మహిళా రెజర్లను లైంగికంగా, మానసికంగా వేధించిన బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా తాము ఇన్నాళ్లపాటు చేసిన పోరాటానికి విలువ లేకుండాపోయిందని వాపోయారు.