Road Accident: దైవదర్శనానికి వెళ్తున్న కుటుంబాన్ని చిదిమేసిన లారీ డ్రైవర్ నిద్రమత్తు

4 killed in road accident in Hanumkonda

  • హన్మకొండలో ఘోర రోడ్డు ప్రమాదం
  • వేములవాడ రాజన్న దర్శనానికి బయలుదేరిన అన్నదమ్ముల కుటుంబాలు
  • నలుగురి దుర్మరణం.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
  • పరారీలో లారీ డ్రైవర్

వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్తున్న కుటుంబాన్ని లారీ డ్రైవర్ నిద్రమత్తు చిదిమేసింది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేట క్రాస్ వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ముగ్గురు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన అన్నదమ్ములైన కాంతయ్య, శంకర్ కుటుంబాలు వేములవాడ రాజరాజేశ్వరస్వామి దర్శనానికి కారులో బయలుదేరాయి. ఈ తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న కారును పెంచికల్‌పేట వద్ద కరీంనగర్‌వైపు నుంచి వస్తున్న లారీ అతివేగంగా ఢీకొట్టింది. ఆ వేగానికి కారు పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. కారు నుజ్జునుజ్జయింది. తీవ్ర గాయాలతో కారులో చిక్కుకున్న వారు బయటకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునే సరికే వారిలో నలుగురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం లారీ డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. డివైడర్‌ను దాటిమరీ వచ్చి కారును ఢీకొట్టిన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో అన్నదమ్ములు కాంతయ్య, శంకర్, భరత్, చందన ఉన్నారు. గాయపడిన వారిని రేణుక, భార్గవ్, శ్రీదేవిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Road Accident
Hanumkonda
Eturunagaram
Vemulawada
  • Loading...

More Telugu News