longest night: ఇండియాలో ఈ రోజు ఏడాదిలోనే సుదీర్ఘ రాత్రి, అతి తక్కువ పగలు!
- నేడు భారత్‌లో అతి తక్కువ పగటి కాలం
- ‘శీతాకాలపు అయనాంతం’ కారణంగా ఏర్పడనున్న సుదీర్ఘ రాత్రి
- 7 గంటల 14 నిమిషాలు మాత్రమే పగటిపూట వెలుతురు
దేశవ్యాప్తంగా చలిపులి పంజా విసురుతోంది. అన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక శీతాకాలంలో మాత్రమే కనిపించే ప్రకృతి మార్పులు ఆవిష్కృతమవుతున్నాయి. ఇక చలికాలం మాయాజాలంలో భాగంగా భారత్ నేడు(శుక్రవారం) సుదీర్ఘమైన రాత్రి, అతి తక్కువ పగటిపూటని గమనించనుంది. సీజన్ మార్పులో భాగంగా ప్రతి ఏడాది డిసెంబర్ 21 లేదా డిసెంబరు 22న ఈ కాల పరివర్తన జరుగుతుంది. ఈ దృగ్విషయాన్నే ‘శీతాకాలపు అయనాంతం’ (Winter Solstice) అని పిలుస్తారు.
భూమి ఉత్తరార్ధగోళం సూర్యుడికి దూరంగా వంగినప్పుడు ‘శీతాకాలపు అయనాంతం’ ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి తన అక్షం మీద 23.4 డిగ్రీలు వంగుతుంది. ఈ కారణంగా భూమి ధ్రువం పగటిపూట సూర్యుడికి దూరంగా ఉంటుంది. అందుకే అతి తక్కువ పగలు, సుదీర్ఘమైన రాత్రి ఏర్పడుతాయి. ఈ మార్పు కారణంగానే డిసెంబర్ 22 శుక్రవారం (నేడు) భారత కాలమానం ప్రకారం ఉదయం 8.57 గంటలకు శీతాకాలపు అయనాంతం సంభవించింది. ఫలితంగా ఉత్తరార్థ గోళంలో అతి తక్కువ పగటిపూట సంభవిస్తుంది. దాదాపు 7 గంటల 14 నిమిషాలు మాత్రమే పగటిపూట వెలుతురు ఉంటుంది.