BRS: పదేళ్లలో తెలంగాణను విద్యుత్ రంగంలో నెంబర్ వన్‌గా నిలిపాం: జగదీశ్ రెడ్డి

Jagadeesh Reddy on power sector in brs regime

  • తెలంగాణలో వెలుగులు తీసుకు వచ్చామన్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
  • పదేళ్లలో పంపు సెట్ల సంఖ్య పెరిగిన మాట వాస్తవమేనని వ్యాఖ్య
  • కాలువల మీద, చెక్ డ్యాంల మీద మోటార్లు పెట్టుకున్నారని వెల్లడి

పదేళ్లలో తెలంగాణను విద్యుత్ రంగంలో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపామని, వెలుగులు తీసుకు వచ్చామని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. శాసన సభలో విద్యుత్ రంగంపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రం ఏర్ప‌డే నాటికి స్థాపిత విద్యుత్ సామ‌ర్థ్యం 7,700 మెగావాట్ల‌ పైన ఉందని, రూ.22 వేల‌ కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని, రూ.44 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయ‌ని జగదీశ్ రెడ్డి చెప్పారు. శ్వేత‌ప‌త్రంలో కూడా అదే ఉందని తెలిపారు. కాంగ్రెస్ హ‌యాంలో వ్య‌వ‌సాయానికి ఆరు గంట‌లు క‌రెంట్ ఇచ్చారని, 4 నుంచి 8 గంట‌లు ఇత‌ర రంగాల‌కు ఇస్తున్నట్లు చెప్పారని గుర్తు చేశారు. పరిశ్రమలకు రెండు రోజుల వర్క్ హాలీడే ఉండేదని, దీనిని తాను చెప్పడం లేదని, అందరికీ తెలిసిందే అన్నారు.

ఈ పదేళ్లలో పంపు సెట్ల సంఖ్య పెరిగిన మాట వాస్తవమని, కాలువల మీద మోటార్లు పెట్ట‌డం వ‌ల్ల పంపు సెట్ల సంఖ్య పెరిగిందన్నారు. చెక్ డ్యాంల వ‌ద్ద మోటార్లు పెట్టుకున్నారన్నారు. మిష‌న్ కాక‌తీయ ద్వారా ఆరు మీట‌ర్ల భూగ‌ర్భ‌జ‌లాలు పెరిగినట్లు కేంద్ర సంస్థ‌లు చెప్పాయన్నారు. అన్నింటికి మించి వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందన్నారు. 2013-14 నాడు రెండు పంట‌లు క‌లిపి 40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం సేక‌రిస్తే, గ‌త ఏడాది రెండు పంట‌లు క‌లిపి 2 కోట్ల 30 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. వీటికి మించి ఇంకా సాక్ష్యాలు ఏం కావాలన్నారు.

రైతులు స‌హా అన్ని రంగాల వినియోగ‌దారుల‌కు ఇరవై నాలుగు గంట‌ల క‌రెంట్ ఇవ్వ‌డానికి క‌ట్టుబ‌డి ఉన్నారా? అని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లంద‌రికి కూడా 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ ఎప్పటి నుంచి అమలు చేస్తారు? అనే అంశంపై స్పష్టతనివ్వాలన్నారు.

More Telugu News