Warangal Urban District: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా కేసు కలకలం.. కొట్టి పారేసిన వైద్యులు
- భూపాలపల్లికి చెందిన 41 ఏళ్ల మహిళ కరోనా లక్షణాలతో ఎంజీఎం కొవిడ్ వార్డులో చేరిందని ప్రచారం
- మరో ముగ్గురిని కూడా అనుమానితులుగా గుర్తించినట్లు వాట్సాప్‌లో చక్కర్లు
- ఆందోళన అవసరం లేదన్న వైద్యాధికారులు
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కొవిడ్ కేసులు నమోదయ్యాయనే పుకార్లు సోషల్ మీడియాలో రావడంతో ఆసుపత్రిలోని రోగులు, అటెండెంట్లు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు స్పష్టం చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన 41 ఏళ్ల మహిళ కరోనా లక్షణాలతో ఎంజీఎం కొవిడ్ వార్డులో చేరిందని... నగరానికి చెందిన మరో ముగ్గురిని కూడా అనుమానితులుగా గుర్తించినట్లు వాట్సాప్‌లో సమాచారం చక్కర్లు కొట్టింది.
దీంతో పాటు వారి నుంచి నమూనాలు సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌కు పంపించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఎంజీఎం కొవిడ్ వార్డులో ఎలాంటి అనుమానితులు గానీ లేదా కరోనా జేఎన్.1 లక్షణాలు ఉన్నవారు గానీ నమోదు కాలేదని అధికారులు తెలిపారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలను అనుసరించి 50 పడకలతో కొవిడ్ వార్డును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.