Tabs: ఏపీలో విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ

AP CM Jagan Starts Tabs Distribution To 8th Class Students
  • 9 వేలకు పైగా స్కూళ్లలో 4.34 లక్షల ట్యాబ్ లు
  • చింతపల్లిలో ట్యాబ్ ల పంపిణీని ప్రారంభించిన సీఎం జగన్
  • రెండేళ్లలో విద్యార్థులు, టీచర్లకు మొత్తం 9.53 లక్షల ట్యాబ్ లు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరుసగా రెండో ఏడాది కూడా విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్ లను అందజేస్తోంది. అంతర్జాతీయ వేదికలపై ఏపీ విద్యార్థులు ప్రతిభ కనబర్చాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం జగన్ చెప్పారు. ఈ ఏడాది రూ.620 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు 4,34,185 ట్యాబ్ లను అందించనున్నట్లు తెలిపారు. ఈ ట్యాబ్ లలో రూ.15,500 విలువైన బైజూస్ కంటెంట్ ను ప్రిలోడెడ్ గా ఇస్తున్నామని, ట్యాబ్ ధర రూ.17,500 తో కలిపి ప్రతీ విద్యార్థికి రూ.33 వేల మేర లబ్ది కలుగుతుందని చెప్పారు.

తాజాగా అందజేస్తున్న ట్యాబ్ లతో కలిపి రెండేళ్లలో 9,52,925 ట్యాబ్ లు (విద్యార్థులు, టీచర్లకు కలిపి) పంపిణీ చేశామని ప్రభుత్వం వెల్లడించింది. వీటి విలువ రూ.1,305.74 కోట్లు అని అధికారులు చెప్పారు. విద్యార్థులకు అందించిన ట్యాబ్ లలో ఇంటర్మీడియెట్ కంటెంట్ ను కూడా అప్ లోడ్ చేసేలా మార్పులు చేశామన్నారు. ఇందుకోసం ట్యాబ్ స్టోరేజ్ సామర్థ్యాన్ని 256 జీబీకి పెంచినట్లు తెలిపారు. ఈ ట్యాబ్ లను దుర్వినియోగం చేయకుండా ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అవాంఛనీయ సైట్లు, యాప్స్ ను నిరోధించే ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను ఇన్ బిల్ట్ గా పొందుపరిచామని చెప్పారు. ప్రత్యేకంగా మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి విద్యార్థుల యాక్టివిటీపై నిఘా పెడుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
Tabs
AP Students
CM Jagan
Chintapalli
Tabs Distribution

More Telugu News