Revanth Reddy: హరీశ్ రావు సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారన్న రేవంత్ రెడ్డి... ఆయన సీఎంలా కాకుండా పీసీసీ చీఫ్‌లా మాట్లాడుతున్నారన్న హరీశ్ రావు!

Revanth Reddy versus Harish Rao in Telangana Assembly

  • అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వర్సెస్ హరీశ్ రావు
  • భవిష్యత్తులో ఓడీని ఉపయోగించమని కాంగ్రెస్ హామీ ఇస్తుందా? అని హరీశ్ రావు నిలదీత
  • హరీశ్ రావు సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి చురక

తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మధ్య మరోసారి మాటల యుద్ధం సాగింది. హరీశ్ రావు మాట్లాడుతూ... బడ్జెట్ గ్యాప్‌ను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, శ్వేతపత్రం పేరుతో నికర అప్పు చెప్పారు కానీ, ఆస్తుల విలువ చెప్పలేదని మండిపడ్డారు. కేంద్ర సంస్థలను కాంగ్రెస్ హయాంలో తెచ్చినట్లుగా చెప్పారని, కానీ వాటితో రాష్ట్రానికి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఓడీని ఉపయోగించమని కాంగ్రెస్ హామీ ఇస్తుందా? అని ప్రశ్నించారు. సభను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేయవద్దన్నారు.

హరీశ్ రావు వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. హరీశ్ రావు సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించారని హరీశ్ రావు చెప్పి ఉంటే హుందాగా ఉండేదన్నారు. ఇంకా ప్రజలను ఎన్నాళ్లు మభ్యపెడతారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాంట్రాక్టర్లకు ఇంకా రూ.3వేల కోట్లు పేమెంట్స్ చేయాల్సి ఉందన్నారు. నాలుగు నెలల తర్వాత పిలవాల్సిన మద్యం టెండర్లను ఎన్నికలకు ముందే పిలిచారన్నారు. బీఆర్ఎస్ హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. పదవుల కంటే వ్యవస్థలు ముఖ్యమని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చింది తామేనని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సీఎంలా కాకుండా పీసీసీ అధ్యక్షుడిలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్వేతపత్రం విషయంలో ప్రజలను, సభను కాంగ్రెస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని వైట్ పేపర్లు పెట్టినా తమకు అభ్యంతరం లేదన్నారు.

  • Loading...

More Telugu News