Atchannaidu: టీడీపీ, జనసేన కలిశాయి... వైసీపీకి దబిడిదిబిడే: అచ్చెన్నాయుడు
- పోలిపల్లిలో టీడీపీ యువగళం నవశకం సభ
- హాజరైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
- టీడీపీ-జనసేన విజయాన్ని అడ్డుకోవడం జగన్ తరం కాదని వ్యాఖ్యలు
విజయనగరం జిల్లా పోలిపల్లిలో టీడీపీ ఏర్పాటు చేసిన యువగళం నవశకం సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రసంగించారు. టీడీపీ, జనసేన పార్టీలు కలిశాయని, ఇక వైసీపీకి దబిడిదిబిడేనని అన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కలుస్తారని వైసీపీ సైకోలు ఊహించలేదని తెలిపారు. కానీ, మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి టీడీపీ, జనసేన ఏకం కావాల్సిన చారిత్రాత్మక అవసరం ఏర్పడిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
"చంద్రబాబు పైసా అవినీతి చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసు పెట్టి 53 రోజులు జైల్లో ఉంచాడు. ప్రజలకు సుపరిపాలన దక్కనివ్వకూడదని సైకో జగన్ అనేక డ్రామాలాడుతున్నారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన రాకుండా అడ్డుకోవడం జగన్మోహన్ రెడ్డి తరం కాదు.
టీడీపీ, జనసేనలో బలహీన వర్గాల వారు నాయకులుగా పనిచేస్తున్నారు... వైసీపీలో బానిసలుగా పనిచేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపికి డిపాజిట్లు కూడా రావు. వచ్చే ఎన్నికల్లో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీ మధ్య చిచ్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తాడు. మనం అప్రమత్తంగా ఉండాలి.
2024లో ఏపీకి పట్టిన దరిద్రాన్ని రాష్ట్ర ప్రజలు బంగాళాఖాతంలో కలిపేయాలని కోరుతున్నా. 5 కోట్ల ఆంధ్రులంతా గుర్తుపెట్టుకోవాలి... రానున్న ఎన్నికలు టీడీపీ-జనసేనకు వైసీపీకి మధ్య ఎన్నికలు కాదు... రాష్ట్ర ప్రజలకు, దోపిడీదారుడికి మధ్య జరిగే యుద్ధం. ప్రజల కోసం ఒక్కటై టీడీపీ-జనసేన నాయకత్వాన్ని ఆదరించాలి, ఆశీర్వదించాలి" అని పిలుపునిచ్చారు.
లోకేశ్ గురించి నేను ముందే చెప్పాను
నారా లోకేశ్ చంద్రబాబు వారసుడే కాదు... రాజకీయ పరిణతి కలిగిన నాయకుడని కుప్పం సభలోనే చెప్పాను. పాదయాత్రలో నారా లోకేశ్ బలమైన సైనికుడు అని కూడా రుజువు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు మేం ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదు. యువగళంపై సైకో జగన్మోహన్ రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించాడో రాష్ట్రమంతా చూసింది. లోకేశ్ వాటన్నింటిని అధిగమించి తన పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారు... బాధితులను ఓదార్చారు. అవినీతి నాయకుల బాగోతాన్ని ప్రజల్లో ఎండగట్టారు.. యువతకు భరోసానిచ్చారు.