Heart Transplant: పదకొండేళ్ల చిన్నారికి గుండె మార్పిడి

Heart Transplantation To 11 Year Old At Tirupati Sripadmavathi Hospital

  • విజయవంతంగా పూర్తిచేసిన శ్రీపద్మావతి ఆసుపత్రి వైద్యులు
  • బ్రెయిన్ డెత్ కు గురైన 50 ఏళ్ల వ్యక్తి నుంచి గుండె సేకరణ
  • శ్రీకాకుళం నుంచి తిరుపతికి గ్రీన్ చానల్ ద్వారా తరలించిన వైద్య సిబ్బంది

అవయవ మార్పిడి కారణంగా ఓ పదకొండేళ్ల చిన్నారికి పునర్జన్మ లభించింది. హృద్రోగంతో బాధపడుతున్న చిన్నారికి తిరుపతిలోని శ్రీపద్మావతి ఆసుపత్రి వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. గుండె మార్పిడి శస్త్ర చికిత్సతో ఊపిరి అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని ఈ ఆసుపత్రిలో మంగళవారం అవయవమార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు.

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణకు చెందిన పదకొండేళ్ల చిన్నారి హృద్రోగంతో బాధపడుతోంది. పాపను పరీక్షించిన తర్వాత గుండె మార్పిడి చేయాల్సిందేనని తేల్చిన వైద్యులు.. జీవన్ దాన్ ట్రస్టులో పేరు నమోదు చేయించారు. అవయవదాత కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని 50 ఏళ్ల వ్యక్తి స్ట్రోక్ కారణంగా బ్రెయిన్ డెత్ కు గురయ్యారు. వైద్యుల కౌన్సెలింగ్ తో కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు.

దీంతో శ్రీకాకుళంలోని జేమ్స్ ఆసుపత్రిలో వైద్యులు ఆ వ్యక్తి గుండెను సేకరించారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో విశాఖపట్నం, ఆపై ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్ పోర్టుకు.. గ్రీన్ చానెల్ ద్వారా ట్రాఫిక్ ఆపేసి గుండెను ఆసుపత్రికి చేర్చారు. అప్పటికే ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్న వైద్య బృందం.. చిన్నారికి విజయవంతంగా గుండెను అమర్చింది. ఈ వైద్య బృందానికి డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డాక్టర్ గణపతి నేతృత్వం వహించారు.

  • Loading...

More Telugu News