World Health Organization: కొవిడ్ జేఎన్.1ను ‘వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా వర్గీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
- ఈ వేరియెంట్‌తో ఆరోగ్యానికి పెద్దగా ముప్పులేదని వెల్లడించిన డబ్ల్యూహెచ్‌వో
- అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో జేఎన్.1 వేరియెంట్ నుంచి రక్షణ పొందొచ్చని వెల్లడి
- ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న జేఎన్.1 కేసులపై ఆందోళన
కరోనా వైరస్ కొత్త వేరియెంట్ జేఎన్.1ను ‘‘వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం వర్గీకరించింది. అయితే ఈ వేరియెంట్‌తో జనాలకు పెద్దగా ముప్పు లేదని తెలిపింది. అందుబాటులో ఉన్న ఆధారాల పరంగా చూస్తే జేఎన్.1తో ప్రపంచానికి పెద్ద ప్రమాదంలేదని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేసింది. కాగా మాతృ వంశం బీఏ.2.86లో భాగంగా జేఎన్.1ను ఇంతకుముందే ‘వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా వర్గీకరించారు. మరోవైపు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో జేఎన్.1 వేరియెంట్‌తో పాటు వేర్వేరు కొవిడ్ వేరియెంట్ల ద్వారా వచ్చే వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చునని వెల్లడించింది.
ఇదిలావుంచితే ప్రపంచ వ్యాప్తంగా జేఎన్.1 ఆందోళనలు నెలకొన్నాయి. జేఎన్.1 వేరియెంట్‌ను మొదటిసారి అమెరికాలో సెప్టెంబర్ నెలలో గుర్తించారు. గత వారం చైనాలో కూడా 7 కేసుల నమోదయాయి. డిసెంబర్ 8 నాటికి అమెరికాలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 15 శాతం నుంచి 29 శాతం జేఎన్.1 వేరియెంట్ కేసులేనని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అంచనా వేసింది. అయితే ఇతర వేరియంట్లతో పోల్చితే జేఎన్.1 ప్రజారోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తోందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని సీడీసీ చెప్పింది.