Judge: కోర్టు వాయిదాకు తనకు బదులు డ్రైవర్‌ని పంపించిన వైసీపీ నేత.. జడ్జి ఆగ్రహం

Judge angry over YCP leader who sent driver instead of him for adjournment of court

  • విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసరెడ్డిపై కోర్టు ఆగ్రహం
  • కోర్టు సిబ్బందికి అనుమానం రావడంతో అసలు విషయం వెలుగులోకి 
  • వెంటనే శ్రీనివాసరెడ్డిని కోర్టుకు పిలిపించిన జడ్జి   
  • సంజాయిషీ లేఖ రాయించి ఇంటికి పంపించిన వైనం 

వైసీపీ నేత, విజయవాడ డిప్యూటీ మేయర్‌ శైలజారెడ్డి భర్త అవుతు శ్రీనివాసరెడ్డి కోర్టు ఆగ్రహానికి గురయ్యారు. 2015 నాటి కేసులో మంగళవారం కోర్టు వాయిదాకు వెళ్లాల్సి ఉండగా తనకు బదులు డ్రైవర్‌ను పంపించారు. దీంతో ఆయనపై జడ్జి సీరియస్ అయారు. పర్యవసానంగా ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. 

శ్రీనివాసరెడ్డి మంగళవారం కోర్టు వాయిదాకు హాజరు కావాల్సి ఉండగా వ్యక్తిగత డ్రైవర్‌ మురారిని పంపించారు. కోర్టు గుమస్తా నిందితుల పేర్లు పిలవగా కేసులోని నిందితులతోపాటు మురారి కూడా కోర్టు హాలులోకి ప్రవేశించాడు. అయితే వయసు వ్యత్యాసంతోపాటు అతడు తడబడుతుండడాన్ని కోర్టు సిబ్బంది గమనించారు. అనుమానం వచ్చి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగుచూసింది. తాను శ్రీనివాసరెడ్డిని కాదని డ్రైవర్ మురారి అంగీకరించాడు.

దీంతో జడ్జి గాయత్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాసరెడ్డిని కోర్టుకు పిలిపించారు. న్యాయస్థానాలంటే ఆషామాషీ అనుకుంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకరిని పంపించడమేంటని నిలదీశారు. ఏదైనా ఉంటే న్యాయవాదికి చెప్పాలి కానీ ఇలా చేయడం ఏంటని ప్రశ్నించారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డితో సంజాయిషీ లేఖ రాయించి పంపించారు.

కాగా ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆగస్టు 29, 2015న వైసీపీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఆందోళనలో భాగంగా విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద వైసీపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఇందులో పాల్గొన్న 9 మందిపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో అవుతు శ్రీనివాసరెడ్డి పేరు కూడా ఉంది. ఈ కేసుపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది.

  • Loading...

More Telugu News