Avanish Rao: హైదరాబాద్ క్రికెటర్ అవనీశ్ రావును కొనుగోలు చేసిన సీఎస్కే

CSK purchase Hyderabad cricketer Avanish Rao

  • దుబాయ్ లో ముగిసిన ఐపీఎల్ వేలం
  • పలువురు క్రికెటర్లకు ఊహించని రీతిలో కాసుల వర్షం
  • అండర్-19 క్రికెటర్ అవనీశ్ ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన చెన్నై

ఐపీఎల్ ఆటగాళ్ల మినీ వేలంలో హైదరాబాద్ యువ క్రికెటర్ ఆరవెల్లి అవనీశ్ రావును చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. ఆరవెల్లి అవనీశ్ రావు అండర్-19 వరల్డ్ కప్ కు ఎంపికైన భారత కుర్రాళ్ల జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. ఇటీవల అండర్-19 వరల్డ్ కప్ లోనూ భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. కాగా, దుబాయ్ లో నేడు జరిగిన ఐపీఎల్ వేలంలో అవనీశ్ రావును చెన్నై సూపర్ కింగ్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. అవనీశ్ రావు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్. 

ఇక, ప్రస్తుతం టీమిండియాతో వన్డే సిరీస్ ఆడుతున్న దక్షిణాఫ్రికా జట్టులోని పేసర్ నాండ్రే బర్గర్ ను రాజస్థాన్ రాయల్స్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. ఇంగ్లండ్ పేసర్ గస్ ఆట్కిన్సన్ ను రూ.1 కోటితో కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. వెస్టిండీస్ ఆటగాడు షాయ్ హోప్ కు వేలంలో రూ.75 లక్షల ధర పలికింది. అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఆఫ్ఘనిస్థాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీని రూ.1.5 కోట్లతో ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ చేజిక్కించుకుంది. 

ఎవరీ స్పెన్సర్ జాన్సన్?... వేలంలో రూ.10 కోట్లు

ఐపీఎల్ వేలంలో ఎవరూ ఊహించని రీతిలో ఆస్ట్రేలియాకు చెందిన స్పెన్సర్ జాన్సన్ రూ.10 కోట్లతో సంచలనం సృష్టించాడు. స్పెన్సర్ జాన్సన్ ప్రధానంగా ఫాస్ట్ బౌలర్. ఇప్పటివరకు ఆసీస్ జట్టు తరఫున అతడు ఆడింది రెండు టీ20లు, ఒక వన్డే అయినా, బిగ్ బాష్ లీగ్ లో, ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీ 'ది హండ్రెడ్' లో అతడి సంచలన బౌలింగ్ ప్రదర్శన ఐపీఎల్ ఫ్రాంచైజీలను ఆకర్షించింది. ఇవాళ్టి వేలంలో లెఫ్టార్మ్ సీమర్ స్పెన్సర్ జాన్సన్ కోసం గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. నువ్వా? నేనా? అన్నట్టుగా వేలం పాటను పెంచుకుంటూ పోయాయి. చివరికి రూ.10 కోట్లతో గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. స్పెన్సర్ జాన్సన్ కనీస ధర రూ.50 లక్షలే.

రిలీ రూసోకు రూ.8 కోట్లు...

దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ క్రికెట్ స్పెషలిస్టు రిలీ రూసోకు నేటి వేలంలో భారీ ధర పలికింది. రూసోను రూ.8 కోట్లతో పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. వేలంలో రూసో కోసం పలు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అటు, ఇంగ్లండ్ పేసర్ డేవిడ్ విల్లీని రూ.2 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. ఇంగ్లండ్ ఆటగాడు టామ్ కరన్ ను రూ.1.5 కోట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.

ఐపీఎల్ లో తొలి గిరిజన ఆటగాడు ఇతడే!

ఝార్ఖండ్ కు చెందిన యువ క్రికెటర్ రాబిన్ మింజ్ ను గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. ఇప్పటివరకు పెద్దగా ఎవరికీ తెలియని అతడు వేలంలో రూ.3.6 కోట్ల ధర పలకడం విశేషం. అంతేకాదు, ఐపీఎల్ కు ఎంపికైన తొలి గిరిజన క్రికెటర్ గా రాబిన్ మింజ్ నిలిచిపోతాడు. 21 ఏళ్ల రాబిన్ మింజ్ కనీస ధర రూ.20 లక్షలు. 

వాస్తవానికి ఝార్ఖండ్ లోని గుమ్లా జిల్లాకు చెందిన మింజ్... ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ టాలెంట్ హంట్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. అతడిలోని ప్రతిభను పసిగట్టిన ముంబయి ఇండియన్స్ యాజమాన్యం బ్రిటన్ లో శిక్షణ ఇప్పించింది. 

రాబిన్ మింజ్ ఇంకా ఝార్ఖండ్ రంజీ జట్టుకు ఆడలేదు. ఇప్పటివరకు ఝార్ఖండ్ అండర్-19, అండర్-25 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. రాబిన్ మింజ్ హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ గా గుర్తింపు పొందాడు. 

శ్రీలంక క్రికెటర్ కు రూ.4.8 కోట్లు

శ్రీలంక పేసర్ నువాన్ తుషార అనూహ్యరీతిలో ఐపీఎల్ వేలంలో భారీ ధరను పొందాడు. తుషారను రూ.4.8 కోట్లకు ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది. వేలం సందర్భంగా తుషార కోసం ముంబయి ఇండియన్స్, ఆర్సీబీ పోటీపడ్డాయి. అయితే, ముంబయిదే పైచేయిగా నిలిచింది. అటు, బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజూర్ రెహ్మాన్ ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.2 కోట్లతో సొంతం చేసుకుంది. ఆసీస్ క్రికెటర్ ఆష్టన్ టర్నర్ ను రూ.1 కోటి ధరతో లక్నో ఫ్రాంచైజీ చేజిక్కించుకుంది.

  • Loading...

More Telugu News