Komatireddy Venkat Reddy: మీరు ఎప్పుడైనా మినిస్టర్స్ క్వార్టర్‌లోని నా 4వ నెంబర్ క్వార్టర్‌కి రావొచ్చు: నల్గొండ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి ఆహ్వానం

Minister Komatireddy Venkat Reddy welcomes Nalgdona people

  • నల్గొండ ప్రజలు ఎప్పుడైనా నా వద్దకు రావొచ్చునని స్పష్టీకరణ
  • పేదవారి కన్నీరు తుడిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని వ్యాఖ్య
  • నల్గొండలో గూండాయిజం, రౌడీయిజం లేకుండా చేస్తానని హామీ

మీరు ఎప్పుడైనా మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని తన 4వ నెంబర్ క్వార్టర్‌కి... సచివాలయంలోని 5వ ఫ్లోర్‌లోని తన కార్యాలయానికి రావొచ్చునని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. నల్గొండ నియోజకవర్గ ప్రజలకు సూచించారు. ఈ రోజు ఆయన నల్గొండలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పేదవారి కన్నీరు తుడిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. ఇరవై ఏళ్ళు ఒక లెక్కా.. ఇప్పుడు ఒక లెక్కా.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని ధైర్యం చెప్పారు. నల్గొండలో గూండాయిజం, రౌడీయిజం లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు.

'24/7 నల్గొండ ప్రజలకి అందుబాటులో ఉంటా. మీరు ఎప్పుడైనా మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని నా 4 నెంబర్ క్వార్టర్‌కు, సెక్రటేరియట్‌లో 5వ ఫ్లోర్‌లోని నా ఆఫీస్‌కు రావొచ్చు' అని మాటిచ్చారు. రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి నిరుపేదకి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. జిల్లాలో ప్రతీ సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. బెల్ట్ షాపులను మూయిస్తామని... గంజాయి గ్యాంగుల ఆట కట్టిస్తామని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల చివరలో మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.

నల్గొండలో ప్రతిరోడ్డునూ అద్భుతంగా తీర్చిదిద్దుతామని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు, ప్రాంతాలకూ న్యాయం చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం చేయించుకోవచ్చునని చెప్పారు. పదేళ్ల నియంత పాలన పోయి ఇప్పుడు నిజమైన ప్రజాప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఆడబిడ్డలంతా ఎంతో సంతోషంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారన్నారు.

  • Loading...

More Telugu News