Pallavi Prashanth: అమర్‌దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ అభిమానుల దాడి!

Pallavi Prashanth fans attacked Amardeeps car after Bigg Boss 7 telugu season concluded

  • అమర్‌దీప్ కారును అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు రానీయకుండా అడ్డుకున్న వైనం
  • కారులోనే ఉండడంతో హడలిపోయిన అమర్‌దీప్ తల్లి, భార్య
  • స్టూడియో వెలుపల పరస్పరం దాడి చేసుకున్న అమర్‌దీప్‌, పల్లవి ప్రశాంత్ అభిమానులు

బిగ్‌బాస్‌ సీజన్‌-7 ఆదివారం రాత్రితో ముగిసిపోయింది. యూట్యూబర్‌, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ విజేతగా నిలవగా సీరియల్‌ నటుడు అమర్‌దీప్‌ రన్నరప్‌గా నిలిచాడు. స్పెషల్ ఈవెంట్స్, విశిష్ట అతిథులతో గ్రాండ్ ఫినాలే ప్రేక్షకులను అలరించింది. ఫినాలే దృష్ట్యా ఆదివారం రాత్రి అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణా స్టూడియోస్‌కు చేరుకున్నారు. దీంతో పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ అభిమానుల మధ్య అక్కడ ఉద్రిక్తకర వాతావరణం ఏర్పడింది. 

బిగ్‌బాస్ షో ముగియడంతో హౌస్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో అమర్‌దీప్‌ వాహనాన్ని పల్లవి ప్రశాంత్ అభిమానులు చుట్టుముట్టారు. కారు అద్దాలు పగలగొట్టారు. అమర్‌ కారు దిగాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వాహనాన్ని ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నారు. ఈ పరిణామంతో కారులో ఉన్న అమర్‌ తల్లి, అతడి భార్య తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అభిమానుల మధ్య జరిగిన వాగ్వాదమే ఈ అనూహ్య పరిణామానికి కారణమైంది. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అన్నపూర్ణా స్టూడియోస్‌కు చేరుకున్నారు. ఇరు వర్గాల అభిమానులను చెదరగొట్టి భద్రత మధ్య అమర్‌దీప్‌ను పంపించారు.

అభిమానుల మధ్య ఘర్షణ
ఫినాలే కావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణా స్టూడియోస్‌కు చేరుకున్నారు. పల్లవి ప్రశాంత్ విజేత అని తెలియగానే ఆనందంతో అతడి ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. అయితే అక్కడే ఉన్న అమర్‌దీప్‌ ఫ్యాన్‌, పల్లవి ప్రశాంత్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇరు వర్గాల ఫ్యాన్స్ తోపులాటకు దిగారు. అసభ్యపదజాలంతో తిట్టుకున్నారు. పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ మార్గంలో వెళ్తున్న కొండాపూర్‌-సికింద్రాబాద్‌ సిటీ ఆర్టీసీ బస్సు, ఓ కారు అద్దాలను పగులకొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారాయి.

More Telugu News