Kala Venkata Rao: రాజ్యసభ సీట్లను కార్పొరేట్లకు, ప్రక్క రాష్ట్రాల వారికి అమ్ముకున్న చరిత్ర వైసీపీది: కళా వెంకట్రావు
- టీడీపీ ఒక్క బీసీకి కూడా రాజ్యసభ ఇవ్వలేదన్న మంత్రి కారుమూరి!
- టీడీపీ 9 మంది బీసీలకు రాజ్యసభ చాన్స్ ఇచ్చిందన్న కళా వెంకట్రావు
- వైసీపీ అధ్యక్షుడిది అబద్ధాల బతుకు అంటూ విమర్శలు
తెలుగుదేశం పార్టీ 9 మంది సామాన్య బీసీలను రాజ్యసభకు పంపిందని టీడీపీ సీనియర్ నేత కిమిడి కళావెంకట్రావు తెలిపారు. తనతో పాటు రుమాళ్ల రామచంద్రయ్య, గుండు సుధారాణి, అల్లాడి రాజకుమారి, దేవేందర్ గౌడ్, ప్రొ.లక్ష్మన్న, జయప్రద, జి.రామచంద్రయ్య, కెంబూరి రామ్మోహనరావు వంటి సామాన్య బీసీలకు రాజ్యసభ సీట్లు ఇచ్చిందని వెల్లడించారు.
మంత్రి కారుమూరి విమర్శలపై స్పందిస్తూ కళా వెంకట్రావు ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఒక్క బీసీకి కూడా రాజ్యసభ సీటు ఇవ్వలేదని మంత్రి కారుమూరి మాట్లాడటం అతని దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు.
"వైసీపీ అధ్యక్షుడిది అబద్ధాల బ్రతుకు....అందులో ఉన్న మంత్రులది అబద్ధాల బ్రతుకే. అబద్ధాలతో ఎంతో కాలం రాజకీయాలు చేయలేరు. తెలుగుదేశం పార్టీ సామాన్య బీసీలను రాజ్యసభకు పంపితే వైసీపీ వందల కోట్లు తీసుకుని కార్పొరేట్లకు, ప్రక్క రాష్ట్రాల వారికి అమ్ముకుంది. గుజరాత్, ఇతర రాష్ట్రాల వారికి రాజ్యసభ సీట్లు అమ్ముకుంది వైసీపీ కాదా? తండ్రి వైఎస్ఆర్‌ను హత్య చేశారంటూ రిలయన్స్ పై ఆరోపణలు చేసి, మళ్లీ ఆ రిలయన్స్ వారికే రాజ్యసభ సీటు అమ్ముకున్న చరిత్ర మీ అధినేత జగన్ రెడ్డిది. వైసీపీ ఒక్క ఎస్సీకీ గానీ, ఒక్క మైనారిటీకీ గానీ రాజ్యసభ సీటు ఇవ్వలేదు. 10 శాతం బీసీ రిజర్వేషన్లకు కోత కోసి 16,800 రాజ్యాంగబద్ధ పదవులు దూరం చేసి బీసీల గొంతుకోసింది జగన్ రెడ్డే. అధికారం లేని పదవులు ఎందుకు? తెలుగుదేశం పార్టీలా ఒక బీసీని రాష్ట్ర అధ్యక్షుడిని చేసే దమ్ము జగన్ రెడ్డికి ఉందా?" అంటూ కళా వెంకట్రావు సవాల్ విసిరారు.