Amaravati: అమరావతి పరిరక్షణ ఉద్యమానికి నేటితో నాలుగేళ్లు... చంద్రబాబు, లోకేశ్ స్పందన

Chandrababu and Lokesh responds on Amaravati movement

  • జగన్ నిర్ణయాలతో రైతులు రోడ్లపైకి రావాల్సి వచ్చిందన్న చంద్రబాబు
  • జగన్ నిలువెల్లా ద్వేషంతో నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడి
  • మరో మూడు నెలలు ఆగితే తప్పుడు నిర్ణయాలన్నీ సరిదిద్దుతామని స్పష్టీకరణ
  • అమరావతి చిరస్థాయిగా నిలిచిపోతుందన్న లోకేశ్ 

అమరావతి పరిరక్షణ ఉద్యమానికి నేటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. 

భవిష్యత్ నగరం అమరావతిని నిరాదరణకు గురిచేసి ఏపీని రాజధాని లేకుండా నిలబెట్టి నేటికి నాలుగేళ్లు నిండాయని చంద్రబాబు వెల్లడించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన వేలాది మంది రైతులు... నిలువెల్లా ద్వేషంతో నిండిన, దురాశాపరుడైన జగన్ తీసుకున్న విధ్వంసక నిర్ణయాల వల్ల రోడ్లపైకి రావాల్సి వచ్చిందని వివరించారు. 

మరో మూడు నెలలు ఆగితే జగన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలన్నీ సరిదిద్దుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. రైతుల త్యాగాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా కారాదు... జై అమరావతి అంటూ నినదించారు. 

జగన్ మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేశారు: లోకేశ్

జగన్ ఏపీలో విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు పూర్తయ్యాయని నారా లోకేశ్ పేర్కొన్నారు. తన మూడు ముక్కలాటతో ప్రజా రాజధాని అమరావతిని జగన్ నాశనం చేశారని విమర్శించారు. వేల కోట్ల రూపాయల విలువైన భవనాలను శిథిలం చేశారని, రోడ్లు మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను హింసించారని వెల్లడించారు. 

రాష్ట్రంలో జగన్ అరాచక పాలన మూడు నెలల్లో ముగిసిపోనుందని, ప్రజా రాజధాని అమరావతి చిరస్థాయిగా నిలిచిపోతుందని లోకేశ్ స్పష్టం చేశారు.

More Telugu News