Cold: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి

Temperatures Decreasing In AP And Telangana

  • రోడ్లను కమ్మేస్తున్న పొగమంచు.. పగలు కూడా దారి కనిపించని వైనం
  • ఏజెన్సీ ప్రాంతాలలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
  • తెలంగాణలో నేడు రేపు పెరగనున్న చలి తీవ్రత
  • తిరుమల ఘాట్ రోడ్ లో వాహనదారుల ఇబ్బందులు

తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. తెలంగాణలో శని, ఆదివారాల్లో చలి తీవ్రత మరింత పెరగనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తూర్పు ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి పెరుగుతుందన్నారు. రాత్రిపూట అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పారు. ప్రజలు చలిమంటలు వేసుకుని కాలక్షేపం చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి రోడ్లను కమ్మేస్తున్న పొగమంచు మధ్యాహ్నానికి కూడా వీడడంలేదు. దీంతో చాలాచోట్ల పట్ట పగలు కూడా వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తోంది.

ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలలో చలి పంజాకు జనం వణికిపోతున్నారు. ఇటీవలి మిగ్జామ్ తుపాన్ తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయని అధికారులు చెబుతున్నారు. పాడేరులో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. రోడ్లపై రెండు అడుగుల దూరంలో ఏమున్నదీ కనిపించని పరిస్థితి నెలకొంటోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో బయట అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు. మరో రెండు మూడు రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, తిరుమలలో పొగమంచుకు తోడు వర్షం కురవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. దట్టమైన పొగమంచు కారణంగా పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలలో వాహనాల రాకపోకలను టీటీడీ అధికారులు నిలిపివేశారు. శుక్రవారం సాయంత్రం నుంచే వాహనాలను ఆపేశారు. పొగమంచుతో ఘాట్ రోడ్డులో తిరుమల పైకి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

Cold
Temperatures
Agency Areas
AP
Telangana
  • Loading...

More Telugu News