Lalit Jha: లలిత్ ఝా పార్లమెంటులో అరాచకం సృష్టించాలనుకున్నాడు: కోర్టుకు తెలిపిన పోలీసులు

Lalit Jha wanted to create anarchy in Parliament Delhi Police told court

  • పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై పాటియాలా కోర్టుకు రిపోర్టు సమర్పించిన ఢిల్లీ పోలీసులు
  • ఇతర నిందితులను చాలాసార్లు కలిసినట్టుగా లలిత్ ఝా అంగీకరించాడని నివేదికలో ప్రస్తావన 
  • నిందితులు తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనుకున్నారని వెల్లడి

పార్లమెంటు భద్రతా ఉల్లంఘన ఘటనలో దర్యాప్తు వివరాలను ఢిల్లీ పోలీసులు పాటియాలా హౌస్ కోర్టుకు సమర్పించారు. తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ప్రధాన సూత్రధారి లలిత్ ఝా, సహ నిందితులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనుకున్నారని, లోక్‌సభలో  అరాచకం సృష్టించాలని భావించారని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ మేరకు రిపోర్టును శుక్రవారం సమర్పించారు. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనకు ప్లాన్ చేసేందుకు ఈ కేసులోని ఇతర నిందితులను తాను చాలాసార్లు కలిశానని ఝా అంగీకరించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. బీహార్‌కు చెందిన ఝా ప్రస్తుతం కోల్‌కతాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని ప్రస్తావించారు.

కాగా కోర్టు అనుమతి తీసుకొని పార్లమెంట్‌ భద్రతా ఉల్లంఘన ఘటన సీన్‌రీకన్‌స్ట్రక్చన్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కోర్టు అనుమతి తీసుకోనున్నట్టు ఓ అధికారి చెప్పారు. ఇప్పటికే లలిత్ ఝాను ఏడు రోజులపాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో మరిన్ని వివరాలు రాబట్టాలని భావిస్తున్నారు. శత్రు దేశాలు లేదా ఉగ్రవాద సంస్థలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో లలిత్ ఝాను పోలీసులు విచారించనున్నారు. ఘటన అనంతరం ఏవిధంగా పారిపోయాడో తెలుసుకునేందుకు అతడిని రాజస్థాన్ తీసుకెళ్లనున్నట్టు ఓ అధికారి చెప్పారు. ఝా తన ఫోన్‌ను విసిరిపడేశాడని, ఇతర నిందితుల ఫోన్లను కాల్పివేశాడని పేర్కొన్నారు. ఇదిలావుండగా  పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సాగర్ శర్మ, మనోరంజన్‌లను లోక్‌సభ ఛాంబర్ లోపల అరెస్టు చేయగా నీలం దేవి, అమోల్ షిండేలను పార్లమెంటు భవనం వెలుపల అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 

కాగా పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటన తర్వాత ప్రధాన సూత్రధారి లలిత్ ఝా రాజస్థాన్‌లో నాగౌర్‌కి పారిపోయాడు. ఢిల్లీ నుంచి బస్సు ద్వారా అక్కడి చేరుకున్నాడు. అక్కడ ఓ హోటల్‌లో రెండు రోజులు బస చేశాడు. కైలాష్, మహేష్ కుమావత్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడైంది. వారిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయనున్నారు.

More Telugu News