Ramajogaiah Sastry: నిన్నటి పాటకు ఏం తక్కువైంది?... ట్రోలర్స్ పై రామజోగయ్య శాస్త్రి ఆగ్రహం

Ramajogaiah Sastry fires on critics

  • మహేశ్ బాబు, త్రివిక్రమ్ కలయికలో గుంటూరు కారం
  • నిన్న 'ఓ మై బేబీ' సాంగ్ విడుదల
  • తమన్ బాణీలకు రామజోగయ్య సాహిత్యం
  • పాట చెత్తగా ఉందంటూ విమర్శలు
  • తెలుసుకుని మాట్లాడండి అంటూ రామజోగయ్య వార్నింగ్
  • మళ్లీ రెచ్చిపోయిన ట్రోలర్స్

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రం నుంచి నిన్న ఓ మై బేబీ అనే లిరికల్ సాంగ్ రిలీజైంది. తమన్ బాణీలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. ఆ పాటలో ఎక్కువగా ఇంగ్లీషు మిక్స్ పదాలు దొర్లాయి. అయితే ఈ పాట చెత్తగా ఉందంటూ నెటిజన్లు రామజోగయ్యశాస్త్రిపై పడ్డారు! దాంతో ఆయన కాస్తా భగ్గుమన్నారు. 

"ప్రతివాడూ మాట్లాడే వాడే... రాయి విసిరే వాడే" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిప్రాయం చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది. పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువైందని? మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా... అదే లేకపోతే, ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం... తెలసుకుని ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి" అంటూ రామజోగయ్యశాస్త్రి ట్రోలర్స్ కు వార్నింగ్ ఇచ్చారు. 

ఈ వార్నింగ్ చూశాక నెటిజన్లు రామజోగయ్యశాస్త్రిని మళ్లీ తగులుకున్నారు! నిన్నటి పాటలో అసలేముందని తక్కువ అవడానికి... ఏమైనా ఉంటే కదా తక్కువ అవడానికి అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. 

తెలుగుదనం తక్కువైంది... త్రివిక్రమ్ సినిమాలో మెలొడీ సాంగ్స్ ను సిరివెన్నెల ఎంత బాగా రాసేవారో... అది మీ పాటలో లేదు అంటూ మరో నెటిజన్ నిర్మొహమాటంగా చెప్పేశాడు. 

మీ (రామజోగయ్యశాస్త్రి) తప్పుకు అన్నయ్య (మహేశ్ బాబు) సారీ చెప్పాల్సి వస్తుంది అంటూ మరో నెటిజన్ వాపోయాడు. సాంగ్ లిరిక్స్ బాగాలేవు... ఇది ఒప్పుకోవడానికి మీకేంటి ప్రాబ్లం అని ఒకరు... పాట అంత బాగా రాస్తే ఇంకా 3 మిలియన్ వ్యూస్ కూడా రాకపోవడం ఏంటయ్యా అని మరొకరు వ్యాఖ్యానించారు. 

ఎన్టీఆర్ 'దేవర'లో పాటలు కూడా ఇలానే రాశారో ఏమో... భయమేస్తోంది అంటూ మరో నెటిజన్... గీత రచయితకు ఆత్మపరిశీలన ముఖ్యం... అంతే తప్ప నా పాటకు ఏం తక్కువైంది అంటూ ఇలా బజారుకెక్కడం సరికాదు అంటూ మరో నెటిజన్... ఇలా తలోరకంగా రామజోగయ్యశాస్త్రిపై విమర్శనాస్త్రాలు సంధించారు.

More Telugu News