Smitha Sabarwal: మంత్రి సీతక్క ఛాంబర్ లో స్మిత సబర్వాల్.. వీడియో ఇదిగో!
- మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సీతక్కకు అభినందనలు
- మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ ఐఏఎస్
- గత ప్రభుత్వంలో స్మిత సబర్వాల్ నీటిపారుదల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు
తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడా కనిపించని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ గురువారం మంత్రి సీతక్క ఛాంబర్ లో ప్రత్యక్షమయ్యారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో సీతక్క వేదపండితులతో పూజలు చేశారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఫైల్ పై సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందులో స్మిత సబర్వాల్ కూడా ఉన్నారు. మంత్రి సీతక్కకు అభినందనలు తెలిపారు.
గత ప్రభుత్వంలో స్మిత సబర్వాల్ సీఎంవోలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన స్మిత సబర్వాల్ మాత్రం ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకోలేదు. దీంతో స్మిత సబర్వాల్ కేంద్ర సర్వీసులోకి వెళుతున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలను తాజాగా ఆమె ఖండించారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని, రాష్ట్రంలోనే ఉంటానని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పగించినా చేపడతానని స్మిత సబర్వాల్ క్లారిటీ ఇచ్చారు.