Parliament: లోక్ సభలోకి చొరబడిన దుండగులు కర్ణాటకకు చెందిన వ్యక్తులుగా గుర్తింపు

Parliament security breach

  • లోక్ సభలో పొగను వదులుతూ, నినాదాలు చేసిన దుండగులు
  • పార్లమెంటు వెలుపల మరో ఇద్దరి నిరసనలు
  • నలుగురిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది

దేశంలో అత్యంత భద్రత కలిగిన పార్లమెంటులోకి దుండగులు చొరబడిన సంగతి విదితమే. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో లోక్ సభ గ్యాలరీ నుంచి ఇద్దరు కిందికి దూకారు. వీరిలో ఒకరు నినాదాలు చేస్తుండగా... మరొకరు పొగను వదిలారు. ఈ ఘటనతో సభలో ఉన్న ఎంపీలు భయభ్రాంతులకు గురయ్యారు. కొందరు బయటకు పరుగులు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 

ఇదే సమయంలో పార్లమెంటు వెలుపల ఇదే తరహాలో ఆందోళనలు చేస్తున్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. లోక్ సభలో పట్టుబడిన వారిని కర్ణాటకకు చెందిన సాగర్ శర్మ, దేవ్ రాజ్ లుగా గుర్తించారు. పార్లమెంటు వెలుపల నిరసన వ్యక్తం చేసిన వారిలో ఒక మహిళ కూడా ఉంది. రంగుల పొగను వదులుతూ ఆమెతో పాటు మరొకరు నిరసన వ్యక్తం చేశారు. సదరు మహిళను హర్యానా హిస్సార్ కు చెందిన నీలం (42)గా గుర్తించారు. మరో వ్యక్తిని మహారాష్ట్ర లాతూర్ కు చెందిన అమోల్ షిండే (25)గా గుర్తించారు. లోక్ సభలోకి ప్రవేశించిన దుండగులు మైసూరు ఎంపీ పేరు మీద పాసులు తీసుకున్నట్టు తెలుస్తోంది.  

2001లో కూడా సరిగ్గా ఇదే రోజున (డిసెంబర్ 13న) పార్లమెంటుపై దాడి జరిగింది. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి వర్ధంతి జరుపుకుంటున్న ఈ రోజే మరో ఘటన జరుపుకోవడం గమనార్హం.

Parliament
Protest
  • Loading...

More Telugu News