KTR: రేవంత్ సర్కారుపై కేటీఆర్ విమర్శలు

Former Minister KTR chitchat with Media

  • అలవి కాని హామీలిచ్చి జనాలను మోసం చేశారని మండిపడ్డ మాజీ మంత్రి
  • ప్రభుత్వం ఏర్పడ్డాక రెండు రోజులకే రుణమాఫీ అన్నారు ఏమైందని ప్రశ్న
  • పది రోజుల్లోనే రూ.15 వేల రైతు భరోసా అన్న హామీ అమలు చేశారా? అని నిలదీత

అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలను ఇచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు ప్రారంభించారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో రుణమాఫీ చేయడానికి తాము ఎంత కష్టపడ్డామో తమకు మాత్రమే తెలుసని చెప్పారు. అలాంటిది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ గురించి అడ్డగోలు హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారని గుర్తుచేశారు. ఈ హామీ ఎలా అమలు చేస్తారో తాము కూడా చూస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. పది రోజుల్లోనే రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పారన్నారు.

అసెంబ్లీ ఆవరణలో బుధవారం కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్న మంత్రుల వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. గత తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా ఆడిట్ రిపోర్టులు మీడియాకు రిలీజ్ చేసిందని గుర్తుచేశారు. ఆయా శాఖలకు సంబంధించిన కాగ్, ఇతరత్రా ఆడిట్ రిపోర్టులను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచామని చెప్పారు. ఆడిట్ రిపోర్టులు శ్వేతపత్రం కాకుంటే మరేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశం ఒకటేనని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని చెప్పడానికే ఈ హంగామా అంతా అని కేటీఆర్ విమర్శించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన కాగ్ రిపోర్టులను, ఆడిట్ నివేదికలను పరిశీలించి దానికి అనుగుణంగా హామీలు ఇవ్వాలని ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఇప్పుడు లెక్కలు వేస్తోందని మండిపడ్డారు. ‘రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు అప్పగించారని కాంగ్రెస్‌ నేతలు చెబుతారు. కాంగ్రెస్‌ పాలకులకు ఇప్పుడుంది అసలు ఆట’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

KTR
Congress govt
Runamafi
Rythu Bharosa
Election Promises
Rahul Gandhi
Revanth Reddy
  • Loading...

More Telugu News