Achem Naidu: అంగన్ వాడీలపై జగన్ కక్ష కట్టారు: అచ్చెన్నాయుడు విమర్శ

TDP AP President Achem Naidu Press Meet

  • జీతాలు పెంచకపోగా సంక్షేమంలోనూ కోత పెట్టాడని ఫైర్
  • వారి డిమాండ్లు న్యాయమైనవేనంటూ మద్దతు
  • టీడీపీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామన్న టీడీపీ నేత

రాష్ట్రంలో అంగన్ వాడీల పరిస్థితి దయనీయంగా మారిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. జీతాలు పెంచక, సంక్షేమంలోనూ కోత పెట్టి జగన్ సర్కారు అంగన్ వాడీలపై కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఒక్క చాన్స్ ఇస్తే తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇస్తానంటూ అంగన్ వాడీలకు ఇచ్చిన హామీని వైఎస్ జగన్ బుట్టదాఖలు చేశారని విమర్శించారు. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లను ప్రభుత్వం బెదిరింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. నిరసనలు చేస్తే ఉద్యోగంలో నుంచి తొలగిస్తానని బెదిరించడం జగన్ అధికార మదానికి నిదర్శనమని చెప్పారు.

పొరుగు రాష్ట్రంతో సమానంగా జీతాలిస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ అంగన్ వాడీల జీతాలు ఎందుకు పెంచలేదని అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. అరకొర జీతంతో అంగన్ వాడీలు బతికేదెలా.. రాజన్న పాలన అంటే ఇదేనా? అంటూ ప్రశ్నించారు. గతంలో అంగన్ వాడీల జీతం రూ.4,200 ఉండగా టీడీపీ హయాంలో సీఎం చంద్రబాబు ఆ మొత్తాన్ని రూ.10,500 లకు పెంచారని గుర్తుచేశారు. 2024లో టీడీపీ అధికారంలోకి రాగానే మరోమారు వారి జీతాలు పెంచుతామని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. అంగన్ వాడీలకు తెలుగు దేశం ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

అంగన్ వాడీలతో వెట్టిచాకిరీ చేయించుకుంటూ సీఎం జగన్ వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆయన విమర్శించారు. ఆందోళన చేస్తే లాఠీ చార్జ్ చేయిస్తూ, ప్రశ్నించిన వారిని మెమోలతో బెదిరిస్తూ జగన్ అరాచక పాలన చేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రమేమైనా నీ తాత జాగీరా జగన్ ?.. అంగన్ వాడీలు నీకు శాశ్వతంగా మెమో ఇచ్చే రోజు దగ్గర్లోనే ఉందని అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు.

Achem Naidu
TDP
Anganwadi
Protest
AP Anganwadi
Salary Hike
Andhra Pradesh
  • Loading...

More Telugu News